Bhale Unnade Review : 'భలే ఉన్నాడే' మూవీ రివ్యూ..ఎమోషనల్ కథతో రాజ్ తరుణ్ మెప్పించాడా?

Bhale Unnade Review : 'భలే ఉన్నాడే' మూవీ రివ్యూ..ఎమోషనల్ కథతో రాజ్ తరుణ్ మెప్పించాడా?

యంగ్ హీరో రాజ్‌‌ తరుణ్, మనీషా కంద్కూర్ జంటగా జె శివసాయి వర్ధన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘భలే ఉన్నాడే’(Bhale Unnade). డైరెక్టర్ మారుతి సమర్పణలో ఎన్వీ కిరణ్ కుమార్  నిర్మించిన ఈ మూవీ ఇవాళ శుక్రవారం (సెప్టెంబర్ 13న) వరల్డ్‌‌వైడ్‌‌గా రిలీజ్ అయింది.

అయితే, కొన్ని అనివార్య కారణాల వలన సెప్టెంబర్ 7న విడుదల అవ్వాల్సిన ఈ చిత్రాన్ని ఒక వారం వాయిదా వేస్తూ సెప్టెంబర్ 13న రిలీజ్ చేశారు మేకర్స్. ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ వస్తున్న రాజ్ తరుణ్ కి 'భలే ఉన్నాడే' మూవీ ఎలాంటి హిట్ ఇచ్చిందో రివ్యూలో చూద్దాం. 

కథేంటంటే::

విశాఖపట్నంలో ఒక బ్యాంకు ఉద్యోగిని గౌరి (Abhirami). తన కొడుకు రాధా( రాజ్ తరుణ్). పెళ్లిళ్లు, ఇతర ఫంక్షన్లలో అమ్మాయిలకు చీరలు కట్టే ఫ్రొఫెషన్‌ను కొనసాగిస్తుంటాడు రాధా. అతనికి తన తల్లి తప్ప మరో ప్రపంచం తెలియని యువకుడుగా బతుకుతుంటాడు రాధా. అంతేకాదు..అతను అమ్మాయిల మధ్య ఉన్నా కూడా..ఆడవారంటే ఎలాంటి ఇంట్రెస్ట్ ఉండదు. దాంతో ఆయనకు మగతనం ఉందా? లేదా? అనే అనుమానం అందరికీ ఉంటుంది.

అలా సాగుతున్న రాధా జీవితంలోకి ఒకరి ఎంట్రీ స్పెషల్ గా ఉంటుంది. తనే..గౌరికి సహోద్యోగినిగా కొత్తగా చేరిన కృష్ణ(మనీషా). ఆడవాళ్లు అంటేనే ఆమడ దూరం అన్నట్టుగా ఉండే రాధా ఎందుకో కృష్ణ విషయంలో వెంటనే కనెక్ట్ అవుతాడు. రాధ చేసే వంటలు కృష్ణకు తెగ నచ్చుతాయి. మొహం చూడకుండానే రాధను ఇష్టపడుతుంది. రాధకి కూడా కృష్ణ అంటే ఇష్టం కలుగుతుంది. కానీ రాధ నుంచి కృష్ణ చాలా ఊహించుకుంటుంది. పైగా తనతో ప్రేమలో ఉన్నపుడు కూడా ఎందుకు ముట్టుకోవడం లేదు అంటూ రాధాపై కృష్ణలో అనుమానాలు మొదలవుతాయి.

ఇక పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతున్న తరుణంలో ఒక ఊహించని పరిణామం ఎదురవుతుంది. దీంతో వాళ్ళిద్దరూ విడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. విడిపోయిన రాధాకృష్ణ మళ్ళీ కలిశారా ?రాధాకు అమ్మాయిలంటే ఎందుకు ఇష్టం ఉండదు? అందరికి డౌట్ ఉన్నట్టు అతడు మగాడేనా? రాధా మీద కృష్ణకి అనుమానం ఎలా కలుగుతుంది? ఆ తరువాత కృష్ణ ఏం చేసింది? తల్లి చాటు బిడ్డగా రాధా ఎందుకు పెరిగాడు? నేటితరం యువకుడిలా రాధా ఎందుకు ఉండలేకపోయాడు? అనే విషయాలు తెలియాలంటే ఈ సినిమాని థియేటర్ లో చూడాల్సిందే.

ఎలా ఉందంటే::

ఈ సినిమా కథగా చూసుకుంటే కొత్త కథ ఏమీ కాదు..అలా అని మరి రొటీన్ సినిమా కూడా కాదు. గతంలో ఎన్నో సినిమాలలో అపార్థాల వల్ల విడిపోయి మళ్ళీ క్లైమాక్స్ లో కలిసిపోయే ప్రేమ జంటల కథలు చూస్తూ వస్తున్నాం. కానీ,  డైరెక్టర్ శివసాయి వర్ధన్ తన మదిలో మెదిలిన పాయింట్‌ను కథగా విస్తరించిన విధానం బాగుంది.

ఫస్టాఫ్‌ను చాలా ఎమోషనల్, ఫన్‌తో చక్కగా నడిపించాడు. హీరో, హీరోయిన్ల క్యారెక్టర్లను ఆయన తీర్చి దిద్దిన విధానం బాగుంది. భలే ఉన్నాడే సినిమా ఈ ట్రెండ్‌కు కావాల్సిన సినిమానే. అసలు ప్రేమ అంటే ఏంటి? మగాడు అంటే ఏంటి? అనేది చెప్పే ప్రయత్నం చేసినట్టుగా కనిపిస్తుంది.ప్రేమ అంటే శారీరక సుఖం.. మగాడు అంటే సుఖపెట్టేవాడు.. అని అనుకునే ఈ ట్రెండ్‌కు తగ్గట్టు, వారికి కనువిప్పు కలిగేట్టుగా ఈ పాయింట్ ఎంటర్టైనింగ్‌గా, ఎమోషనల్‌గా చెప్పే ప్రయత్నం చేశాడు డైరెక్టర్.

ఫస్టాఫ్ చూస్తుంటే.. అదేంటి మళ్లీ మారుతి డైరెక్ట్ చేసిన బస్టాప్, ఈ రోజుల్లో సినిమాలు గుర్తు చేస్తాయి. కానీ, అలా అనిపించదు. ఫస్టాఫ్ కొన్ని సీన్స్ బోల్డ్‌గానే అనిపిస్తాయి.. కానీ సెకండాఫ్ మాత్రం ఎమోషనల్‌గా వెళ్లాడు దర్శకుడు. అసలు ఈ రోజుల్లో రాముడు లాంటి ఒక కుర్రాడు ఉంటే..అతన్ని మిగతా అమ్మాయిలందరూ ఎలా చూస్తారు? తప్పుగా టచ్ చేయడం ఇష్టం లేని వ్యక్తిని సమాజం ఎలా చూస్తుంది అనే విషయాలను బల్లగుద్ది చెప్పడం ఆసక్తికరం. 

ఇక సెకండాఫ్‌లో కూడా కథ, కథనాలను అనుసరించిన తీరు బాగుంది. లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు, లీలా శ్యాంసన్‌ను దంపతులుగా చూపించి వారి మధ్య నడిపిన సున్నితమైన రొమాన్స్, డ్రామా అద్బుతంగా ఉంది. కొన్ని క్రింజ్ కామెడీ సీన్స్ పక్కన పెడితే సినిమా ఎమోషనల్ మోడ్ లోకి వెళుతుంది. అసలు తాను తప్పుగా అమ్మాయిలను ఎందుకు చూడను అనే విషయాన్ని రాజ్ తరుణ్ చెప్పే విధానం ఆడియన్స్ ను ఆకట్టుకునేలా ఉంది.

అయితే, క్లైమాక్స్ అందరూ ఊహించగలిగేలా ఉంటుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే..మగాడంటే ఆడదాన్ని సుఖ పెట్టేవాడు మాత్రమే కాదు, ఆడదానికి ఎలాంటి కష్టం రాకుండా చూసుకునేవాడు అనే పాయింట్ తో భలే ఉన్నాడే సినిమా తెరకెక్కించిన విధానం ఆకట్టుకునేలా ఉంది. ముఖ్యంగా అమ్మ ఎపిసోడ్ అయితే అద్భుతంగా ఉంది.

ఎవరేలా చేశారంటే:

చాలా రోజుల తర్వాత రాజ్ తరుణ్ ఒక వైవిధ్యమైన పాత్రలో సహజంగా ఒదిగిపోయి నటించాడు. ఓవరాల్ గా మంచి బరువైన పాత్రను చాలా హుందాగా పండించాడు. రాజ్ తరుణ్ ఒక తేడా అని అందరి చేత పిలిపించుకునే పాత్రలో జీవించాడని చెప్పొచ్చు.

కొత్తమ్మాయి మనీషా కంద్కూర్ కూడా బాగానే నటించింది.. అలాగే గ్లామర్ షో కూడా. హీరో పాత్ర తర్వాత అంత బరువైన పాత్ర పడింది అభిరామికే. తల్లి కొడుకుల మధ్య వచ్చే సీన్స్ లో ఫీల్ గుడ్ ఫ్యాక్టర్‌ను క్రియేట్ చేశారు.

సీనియర్ దర్శకుడు సింగితం శ్రీనివాసరావు కనిపించింది రెండు మూడు సీన్స్ అయినా సరే మంచి ఇంపాక్ట్ ఉన్న సీన్స్ లో కనిపించారు. విటివి గణేష్ కామెడీ అదిరిపోయింది. హైపర్ ఆది జస్ట్ ఓకే అనేలా ఉంది. మిగిలిన వాళ్లు తమ పాత్రలకు న్యాయం చేసారు. 

సాంకేతిక అంశాలు::

దర్శకుడిగా శివసాయి వర్ధన్ తాను చెప్పాలనుకున్న పాయింట్ ను బాగా తెరకెక్కించి సక్సెస్ అయ్యాడు. ఈ సినిమాతో అతని క్రియేటివిటీకి మంచి మార్కులు వేయించుకునే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా డైలాగ్స్ విషయంలో మాత్రం హ్యాట్సాఫ్ అనాల్సిందే. శేఖర్ చంద్ర సంగీతం ఓకే.. పాటలు పర్లేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్‌గా ఉన్నాయి.