అమ్మ ప్రేమ ఆదరణ సంస్థ వృద్ధులతో ప్రత్యేకమైన అనుబంధం ఉంది: సాయిదుర్గాతేజ్‌

అమ్మ ప్రేమ ఆదరణ సంస్థ వృద్ధులతో ప్రత్యేకమైన అనుబంధం ఉంది: సాయిదుర్గాతేజ్‌

సామాజిక సేవా కార్య‌క్ర‌మాల‌ను చేసే తెలుగు హీరోల్లో సుప్రీమ్ హీరో సాయి దుర్గా తేజ్(Sai DurghaTej) ఒక‌రు. ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లో వరదల కారణంగా ప్రజలు పడుతున్న కష్టాల్ని చూసి తన వంతు బాధ్యతగా రూ.20ల‌క్షలు ప్రకటించిన విషయం తెలిసిందే. (ఏపీ, తెలంగాణ సీఎంల రిలీఫ్ పండ్‌ల‌కు చెరో రూ.10 లక్షలు)

ఇవాళ బుధవారం (సెప్టెంబర్ 11న ) హీరో సాయి దుర్గా తేజ్‌ విజ‌య‌వాడ‌లో ప‌ర్య‌టించారు. ముందుగా శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శంచుకున్నారు. అనంతరం విజయవాడ వాంబే కాలనీలో వరద బాధితులను పరామర్శించారు. వాంబే కాలనీలో అమ్మ ప్రేమ ఆదరణ సంస్థ వృద్ధాశ్రమంలో వృద్ధులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వరద బాధిత వృద్ధుల సహాయార్థం రూ.2 లక్షల చెక్కును అందించారు.ఇతర సేవా సంస్థలకు రూ.3ల‌క్ష‌ల విరాళం అంద‌జేశారు.

సాయి దుర్గ తేజ్ మాట్లాడుతూ.."వరద బాధితులను పరామర్శించేందుకు విజయవాడకు వచ్చానని,  వరద ముప్పు నుంచి అందరూ త్వరగా కోలుకోవాలని దుర్గమ్మను దర్శించుకుని ప్రార్థించానని చెప్పారు. బాధితులను ఆదుకునేందుకు ఎల్లప్పుడూ తన వంతు సహకారం అందిస్తానన్నారు". ఇక ఈ విషయం తెలుసుకున్న మెగా ఫ్యాన్స్ మీ మేనమామ, ఏపీ డిఫ్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గారి నుంచి సేవా గుణాన్ని పుణికిపుచ్చుకున్నావు అంటూ పోస్టులు పెడుతున్నారు. 

అయితే,  2019లో తన పుట్టినరోజు సందర్బంగా అమ్మ ఆశ్రమానికి సొంత భవనం కట్టిస్తానని మాటిచ్చిన సాయి దుర్గతేజ్..చెప్పినట్లుగానే 2021లో భవనం కట్టించి ఇచ్చారు. మూడేళ్ల పాటు అమ్మ అనాథాశ్రమాన్ని దత్తత తీసుకుని మొత్తం ఖర్చులన్నీ భరించారు.

సాయి ధరమ్ తేజ్..తన పేరు మార్చుకున్న విషయం తెలిసిందే. ఉమెన్స్ డే సంద‌ర్భంగా త‌న త‌ల్లి పేరు దుర్గను తీసుకుని సాయి దుర్గ తేజ్‌ (Sai Durga Tej)గా పెట్టుకున్నట్లు ఆయనే స్వయంగా ప్రకటించాడు.