Swag Review: 'స్వాగ్' మూవీ రివ్యూ.. ఐదు పాత్రలతో శ్రీ విష్ణు హిట్ కొట్టాడా?

Swag Review: 'స్వాగ్' మూవీ రివ్యూ.. ఐదు పాత్రలతో శ్రీ విష్ణు హిట్ కొట్టాడా?

సామజవరగమన, ఓం భీమ్‌ బుష్‌ చిత్రాలతో వరుస విజయాలు అందుకున్న శ్రీవిష్ణు (Sree Vishnu).. ఇపుడు ‘స్వాగ్’ (Swag) సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. శ్రీవిష్ణుకి ‘రాజరాజచోర’ లాంటి బ్లాక్ బస్టర్‌‌ను ఇచ్చిన హసిత్ గోలి దీనికి దర్శకుడు. రీతూ వర్మ హీరోయిన్. మీరా జాస్మిన్, దక్షా నగార్కర్, సునీల్, గోపరాజు రమణ కీలకపాత్రలు పోషించారు.

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌ లో టీజీ విశ్వ ప్రసాద్‌ నిర్మించిన ఈ మూవీ.. ఇవాళ శుక్రవారం (అక్టోబర్ 4న) థియేటర్లో రిలీజైంది. ఐదు విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన శ్రీ విష్ణు.. స్వాగ్ మూవీతో ఎంతవరకూ ఆకట్టుకున్నాడో రివ్యూలో చూద్దాం. 

కథేంటంటే:

1551వ సంవత్సరంలో కథ మొదలవుతుంది. మాతృస్వామ్య వ్యవస్థలో వింజామర వంశపు రాణి రుక్మిణీ దేవి (రీతూ వర్మ) పరిపాలనలో పురుషులు అణచివేతకు గురవుతుంటారు. భార్య ఆధిపత్యాన్ని తట్టుకోలేని ఆమె భర్త భవభూతి (శ్రీవిష్ణు).. ఓ పన్నాగం ద్వారా పురుషాధిక్యతను చాటి, తన శ్వాగణిక వంశం జెండాను ఎగుగవేస్తాడు. ఇకపై తన వంశంలో మగపిల్లలు ఉన్న వారికే ఆ రాజ్యపు ఖజానా దక్కాలనే శాపం పెడతాడు. ఆ నిధిని ఓ (గోపరాజు రమణ) వంశం తరతరాలుగా సంరక్షిస్తుంది.

ప్రస్తుత జెనరేషన్‌కు వస్తే.. ఎస్‌ఐగా రిటైర్ అయిన భవభూతి.. శ్వాగణికక వంశపు ఖజానాను దక్కించుకునేందుకు వరుస ప్రయత్నాలు చేస్తుంటాడు. మరోవైపు సోషల్ మీడియా వీడియోలు చేసుకునే సింగకు కూడా శ్వాగణిక వంశపు నిధి గురించి తెలుస్తుంది. పురుషాధిక్యతను సహించలేని అనుభూతి (రీతూ వర్మ) కూడా ఆ నిధి కోసం వస్తుంది. తమ ముందు తరానికి చెందిన యయాతి (శ్రీవిష్ణు) కారణంగానే ఈ నిధికి సంబంధించిన చైన్ లింక్‌కు బ్రేక్ పడిందని తెలుసుకుంటారు. మరి యయాతికి ఈ ముగ్గురికి ఉన్న సంబంధం ఏమిటి? వీళ్లెలా అతనికి వారసులు అయ్యారు? వీళ్లకు ఉత్తరాలు రాసి నిధి విషయం తెలియజేసింది ఎవరు? ‘మైఖెల్ మదన కామరాజు’ లాంటి ఈ కథలో అసలైన రాజు ఎవరన్నదే మిగతా కథ. 

ఎలా ఉందంటే:

వంశ వృక్షం అనగానే ఎంత క్లారిటీగా మ్యాప్ వేసి, క్లాసులు చెప్పినా, ఎవరికి ఎవరు ఏమవుతారు అనే కన్ఫ్యూజన్ ఏదో ఒక మూల కచ్చితంగా ఉంటుంది. ‘మనం’ సినిమా తరహాలో ఎంత సరళంగా ఆ విషయాలు చెబితే అంత సులభంగా అర్థమవుతాయి. కానీ ఆ కన్ఫ్యూజన్‌నే తన సినిమాకు ట్విస్ట్‌లుగా భావించాడు దర్శకుడు. అక్కడే అసలైన చిక్కొచ్చి పడింది. ‘ఎవర్రా మీరంతా’ అనే కన్ఫ్యూజన్‌లో తెరపై కనిపించే క్యారెక్టర్స్ ఏవీ ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ కాలేదు. పైగా సెకెండాఫ్‌ కోసం చాలా విషయాలు దాచేయడంతో ఫస్ట్ హాప్‌ బోరింగ్‌గా సాగింది. అయితే ఇంటర్వెల్ సమయానికి కొత్త పాత్రలను తీసుకొచ్చి.. సెకెండాఫ్‌పై ఆసక్తి పెంచడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. 

మొదటి నుంచి ఇదొక హిలేరియస్ ఎంటర్‌‌టైనర్ అని ప్రమోట్ చేసినంతగా ఇందులో కామెడీ వర్కవుట్ అవలేదు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్‌లో సీన్స్‌ వచ్చి పోతుంటాయి తప్ప కనెక్టివిటీ లేదు. పవర్‌‌ఫుల్‌గా మొదలైన రీతూ వర్మ క్యారెక్టరైజేషన్ క్రమేనా వెయిట్ తగ్గుతూ వచ్చింది. రిటైర్ అయిన ఎస్‌ఐ అదే స్టేషన్‌లో కాపురం ఉండటం, పోలీస్ వెహికిల్స్ తిరగడం కంటే.. రిటైర్మెంట్ దగ్గర పడ్డ ఎస్‌ఐ అని చెబితే వచ్చే నష్టమేమీ లేదు. ఇక ఈ ఫ్యామిలీకి ఎలాంటి సంబంధం లేని రీతూ వర్మ పాత్రకు రాణి రుక్మిణీ దేవి పోలికలు ఎలా వచ్చాయనేది ప్రశ్నార్థకం. బహుశా ఆ లింక్ ఎడిటింగ్‌లో మిస్ అయి ఉండొచ్చు. 

ఇంటర్వెల్ తర్వాత వచ్చే భవభూతి రాజు, యయాతి పాత్రల ప్లాష్ బ్యాక్ సీన్స్‌ ఆకట్టుకున్నాయి. యయాతి ఫ్యామిలీకి సంబంధించిన ఎమోషనల్ సీన్స్ సినిమాకు ప్రధాన బలం. ముఖ్యంగా ‘‘లింగ వివక్ష లేని సమానత్వమే అసలైన సమానత్వం.. సమాజం అంటేనే సమానం” అనే సందేశాన్ని చెప్పాలనుకున్న దర్శకుడి ఆలోచనను మెచ్చుకోవాలి. ముఖ్యంగా ట్రాన్స్ జెండర్ ఇష్యూని ఈ నాలుగు తరాల కథకు లింక్ చేయడం బాగుంది. ఒక రచయితగా మంచి స్టోరీ లైన్‌ ఎంచుకున్న దర్శకుడు.. దానిని ఇంకాస్త క్లారిటీగా, కన్విన్సింగ్‌గా చెప్పి ఉంటే రిజల్ట్ నెక్స్ట్ లెవెల్‌లో ఉండేది.

ఎవరెలా చేశారంటే::

కెరీర్‌‌లో ఎప్పుడూ డ్యూయల్ రోల్ కూడా చేయని శ్రీష్ణు.. స్వాగ్ లో ఏకంగా ఐదు పాత్రలు పోషించి మెప్పించాడు. ముఖ్యంగా ఎవరూ ఊహించని స్థాయిలో ఐదో పాత్రలో నటించాడు. నటుడిగా తన స్థాయిని పెంచే సినిమా ఇది. రీతూ వర్మకు ఈ సినిమాలో మంచి వెయిటేజ్ ఉన్న క్యారెక్టర్ లభించింది. పర్వాలేదు అనిపించింది కానీ పాత్రకు తగ్గ స్థాయిలో కనిపించలేదు. కీలకపాత్రలో మీరాజాస్మిన్ నటన ఆకట్టుకుంది. దక్షా నగర్కార్‌ ఎప్పటిలాగే‌ గ్లామర్‌‌కు పరిమితమైంది. సునీల్, గెటప్ శ్రీను, గోపరాజు రమణ, శరణ్య, రవిబాబు, కిరీటి తమ పాత్రల పరిధి మేరకు నటించారు.  

సాంకేతిక అంశాలు::

వివేక్ సాగర్ నేపథ్య సంగీతం సినిమాకు మెయిన్ ఎస్సెట్‌గా నిలిచింది. వేదరామన్ కెమెరా వర్క్ ఆకట్టుకుంది. శ్రీవిష్ణు ప్రోస్థటిక్ మేకప్ చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. ఎడిటింగ్ విషయంలోనూ ఇంకాస్త దృష్టి పెట్టాల్సి ఉంది. పీపుల్స్ మీడియా సంస్థ నిర్మాణ విలువల్లో ఎక్కడా రాజీ పడలేదు.