విక్టరీ వెంకటేష్(Victory Venkatesh).. టాలీవుడ్ లో ఈ పేరు గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరంలేదు. తనదైన నటనతో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నారు ఈ సీనియర్ హీరో. నిజం చెప్పాలంటే.. ఏ ఇండస్ట్రీలోనైనా స్టార్ హీరోలకి ఫ్యాన్స్ ఉంటారు కానీ.. అందరి హీరోల ఫ్యాన్స్ కు నచ్చే ఏకైక హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది వెంకటేష్ అనే చెప్పాలి. గొప్ప కుటుంబం నుండి వచ్చినా.. ఆ గర్వం ఎక్కడా చూపించకుండా చాలా సాధారణంగా ఉండటం ఆయన నైజం. అందుకే ప్రతీఒక్కరు ఆయనని ఇష్టపడతారు.
ఆయన హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ సైంధవ్. వెంకటేష్ కెరీర్ లో 75వ సినిమాగా వస్తున్న సైంధవ్ ను.. హిట్ చిత్రాల దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కిస్తున్నారు. స్టైలీష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రానున్న ఈ సినిమా.. సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రమోషన్స్ లో భాగంగా వెంకీ 75 కలియుగ పాండవులు టు సైంధవ్ పేరుతో మేకర్స్ స్పెషల్ ఈవెంట్ ను నిర్వహించారు
ఈ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్టుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా తన సినీ ప్రయాణాన్ని గుర్తుచేసుకున్న వెంకటేష్.. చిరంజీవిఠీ మల్టీస్టారర్ సినిమాపై ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. వెంకటేష్ మాట్లాడుతూ..గురువు కె. రాఘవేంద్ర రావు చేసిన కలియుగ పాండవులు సినిమాతో నా సినీ ప్రయాణం మొదలైంది. ఆతరువాత దాసరి నారాయణరావు, కె విశ్వనాథ్ వంటి దర్శకులతో కలిసి పని చేయడం నా అదృష్టం. అభిమానుల ప్రేమ, వారు చూపించిన ఆప్యాయత వల్లనే ఇన్ని సినిమాలు చేశాను. జయాపజయాల్ని పట్టించుకోకుండా ప్రోత్సహించారు.
మొదట్లో విక్టరీ అని పిలిచేవారు, ఆ తర్వాత రాజా అని, పెళ్లికాని ప్రసాద్ అని, పెద్దోడు, వెంకీ మామ.. ఇలా చాలా పేర్లతో పిలుస్తారు. ఎలా పిలిచినా వారి ప్రేమ మాత్రం తగ్గలేదు. చాలాసార్లు సినిమాలు వదిలేసి హిమాలయాలకు వెళ్లిపోదాం అనుకునేవాణ్ని కానీ.. అంతలోనే చిరంజీవి వచ్చి ఓ బ్లాక్ బస్టర్ సినిమా ఇచ్చేవారు. దాంతో నేను కూడా హిట్ సినిమా చేయాలని అనుకునేవాణ్ణి. అలా నాతోటి హీరోలు బాలకృష్ణ, నాగార్జున పాజిటివ్ ఎనర్జీ ఇచ్చేవారు. ఇక సైంధవ్ విషయానికి వస్తే.. ఇదొక గొప్ప సినిమా. మీ అందరికి తప్పకుండా నచ్చుతుంది. ఇక త్వరలోనే చిరంజీవితో కలిసి మూవీ చేస్తా.. అంటూ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు వెంకటేష్. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.