- హీరో దగ్గుబాటి వెంకటేశ్
- కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘురాంరెడ్డికి మద్దతుగా రోడ్ షో
ఖమ్మం, వెలుగు: సినీ నటుడు దగ్గుబాటి వెంకటేశ్మంగళవారం ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డికి మద్దతుగా నగరంలో రోడ్ షో నిర్వహించారు. రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ రేణుకాచౌదరి, కాంగ్రెస్ అభ్యర్థి రఘురాంరెడ్డితో కలిసి ప్రచారం చేశారు. ఖమ్మం కాల్వొడ్డు నుంచి మయూరి సెంటర్, పాత బస్టాండ్, జడ్పీ సెంటర్ మీదుగా ఇల్లందు క్రాస్ రోడ్ వరకు రోడ్ షో సాగింది.
జడ్పీసెంటర్‌లో వెంకటేశ్ మాట్లాడుతూ ఈనెల 13న జరిగే ఎన్నికల్లో ఈవీఎంలో మూడో నంబర్ సీరియల్లో హస్తం పక్కన బటన్ నొక్కాలని కోరారు. ఎనీ సెంటర్.. సింగిల్ హ్యాండ్.. రఘురాంరెడ్డి అంటూ గణేశ్ సినిమా డైలాగ్ చెప్పడంతో జనాలు చప్పట్లు కొట్టారు. ప్రతి ఒక్కరూ ఓటెయ్యాలని, అది హక్కు మాత్రమే కాదు అందరి బాధ్యత అని వెంకటేశ్చెప్పారు. అక్కడ భద్రాచలంలో శ్రీరాముడు, ఇక్కడ ఖమ్మంలో రఘురాముడు అంటూ అందరినీ ఉత్సాహపరిచారు.
అక్కా, తమ్ముడూ, తాతా అంటూ పలకరించారు. అంతకు ముందు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. రోడ్ షోకు భారీగా కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం కార్యకర్తలతో పాటు వెంకటేశ్ అభిమానులు భారీగా తరలివచ్చారు. దీంతో వైరా మెయిన్ రోడ్‌పై ట్రాఫిక్‌ను పోలీసులు దారి మళ్లించారు. మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, నేతలు తుమ్మల యుగంధర్, కమర్తపు మురళి పాల్గొన్నారు.అలాగే కొత్తగూడెంలో రాత్రి జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో కూడా వెంకటేశ్ పాల్గొని మాట్లాడారు.