డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలతో తమిళంలోనే కాక తెలుగులోనూ మార్కెట్ పెంచుకున్న విక్రమ్, త్వరలో ‘కోబ్రా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. అజయ్ జ్ఞానముత్తు డైరెక్ట్ చేసిన ఈ మూవీని ఎన్వీ ప్రసాద్ తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈనెల 31న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా నిన్న హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ నిర్వహించారు. విక్రమ్ మాట్లాడుతూ ‘తెలుగు ప్రేక్షకులతో నాకు చక్కని అనుబంధం ఉంది. నా సినిమాలను ఎప్పటి నుంచో ఆదరిస్తున్నారు. ఇదొక సైకలాజికల్ థ్రిల్లర్. సైన్స్ ఫిక్షన్ అంశాలు, ఎమోషనల్ కంటెంట్, హై ఓల్టేజ్ యాక్షన్ లాంటివన్నీ కలగలిసిన సినిమా. కథ వినగానే ఎప్పుడెప్పుడు చేయాలా అనేంతగా నచ్చింది. కానీ కొవిడ్ కారణాలతో ఆలస్యమైంది. చాలా కష్టపడి చేశాం. పది గెటప్స్‌లో నటించాను కనుక రోజుకు ఐదు గంటలు మేకప్‌కే టైమ్ పట్టేది. కానీ ఇలాంటి డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయడం చాలా సంతోషంగా అనిపించింది. నటించేటప్పుడు ఆ మేకప్ కష్టాలన్ని మర్చిపోయేవాడిని. శ్రీనిధి నాకు పెయిర్‌గా నటించింది.
ఇందులో మా ఇద్దరి రిలేషన్ ఆకట్టుకుంటుంది. ట్రైలర్‌కు రెస్పాన్స్ చాలా బాగుంది. ముఖ్యంగా తెలుగులో చక్కని అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం ప్రేక్షకులు ఆశిస్తున్న అన్నిరకాల ఎలిమెంట్స్ ఉన్న యూనివర్సల్ మూవీ’ అన్నారు. హీరోయిన్ శ్రీనిధి శెట్టి మాట్లాడుతూ ‘ఇదే నా ఫస్ట్ తమిళ సినిమా కావడంతో నాకెంతో స్పెషల్. మూడేళ్లుగా టీమ్ అంతా ఎంతో కష్టపడి చేసిన ఈ చిత్రం త్వరలో జనం ముందుకొస్తోంది. చూసి ఆదరించండి’ అని చెప్పింది. నిర్మాత ఎన్వీ ప్రసాద్ మాట్లాడుతూ ‘కొవిడ్ టైమ్‌లో రెండు సార్లు రష్యా వెళ్లి మైనస్ థర్టీ టెంపరేచర్‌లో అద్భుతమైన యాక్షన్ సీన్స్ చేశారు. ఇన్నేసి పాత్రలు ఒక నటుడు చేయడం సాధారణంగా హాలీవుడ్ సినిమాల్లో చూస్తుంటాం. కానీ మన దేశంలో కమల్ హాసన్ తర్వాత ఆ స్థాయిలో ఇలా మెప్పించే నటుడు విక్రమ్ మాత్రమే. కొత్త కాన్సెప్ట్‌తో హై క్వాలిటీ టెక్నికల్ వ్యాల్యూస్‌తో వస్తోన్న ఈచిత్రం విక్రమ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ సినిమాగా నిలవాలని ఆశిస్తున్నా’ అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో హీరోయిన్స్ మీనాక్షి గోవిందరాజన్, మృణాళిని రవి పాల్గొన్నారు.