ఒక్క మాటకు వేల ట్వీట్స్ ఏంటీ.. సినిమా బతకాలా లేదా..? లైలా వివాదంపై విశ్వక్ సేన్

ఒక్క మాటకు వేల ట్వీట్స్ ఏంటీ.. సినిమా బతకాలా లేదా..?  లైలా వివాదంపై విశ్వక్ సేన్

హైదరాబాద్: యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన లైలా చిత్రం వివాదంలో చిక్కుకుంది. మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో యాక్టర్ పృథ్వీ చేసిన కామెంట్స్ వివాదానికి దారి తీశాయి. దీంతో  ‘‘బైకాట్ లైలా మూవీ’’ అంటూ సోషల్ మీడియాలో ట్రెండింగ్‎గా మారింది. మరో నాలుగు రోజుల్లో సినిమా విడుదల పెట్టుకుని లైలా మూవీ బైకాట్ అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో మూవీ టీమ్ అలర్ట్ అయ్యింది. ఈ క్రమంలోనే లైలా మూవీ వివాదంపై చిత్ర నిర్మాత  సాహు గారపాటి, హీరో విశ్వక్ సేన్ రియాక్ట్ అయ్యారు. 

సోమవారం (ఫిబ్రవరి 10) హైదరాబాద్ ఫిల్మ్ చాంబర్లో విశ్వక్ సేన్, సాహూ గారపాటి మీడియాతో మాట్లాడారు. విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. లైలా మూవీ ఈవెంట్‎లో జరిగిన దానికి సారీ చెపుతున్నాను. ఎవరో ఒకరు తప్పు మాట్లాడితే.. మిగిలిన వాళ్ళు తప్పు చేసినట్టేనా అని అన్నారు.  ప్రీ రిలీజ్ ఈవెంట్లో పృథ్వీ మాట్లాడిన విషయం మాకు తెలీదని.. అతను మాట్లాడిన దానికి సినిమాకు సంబంధంలేదని క్లారిటీ ఇచ్చారు విశ్వక్ సేన్. 

ALSO READ | Prudhvi Raj: నటుడు పృథ్వీ రాజ్ పొలిటికల్ పంచ్లు.. లైలా సినిమాకు డ్యామేజ్ కానుందా?

ప్రీ రిలీజ్ ఈవెంట్‎కు చీఫ్ గెస్ట్‎గా వచ్చిన చిరంజీవిని మేం రిసీవ్ చేయడానికి బయటకు వెళ్ళినప్పుడు.. పృథ్వీ మాట్లాడాడని.. అది మా కంట్రోల్‎లో జరగలేదని వివరణ ఇచ్చారు. పృథ్వీ మాట్లాడిన దానికి సోషల్ మీడియాలో వేల ట్వీట్స్ వస్తున్నాయి.. ఇలా అయితే సినిమా బతకాలా లేదా అని ఆవేదన వ్యక్తం చేశారు. చాలా కష్టపడి లైలా సినిమా తీశామని.. ఈ వివాదం ఇంతటితో ముగించాలని రిక్వెస్ట్ చేశాడు విశ్వక్ సేన్. మా ప్రమేయం లేని దానికి మమ్మల్ని బలి చేయొద్దని కోరారు. 

యంగ్ హీరో విశ్వక్ సేన్, ఆకాంక్ష శర్మ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం లైలా. రామ్ నారాయణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విశ్వక్ సేన్ లేడి గెటప్‎లో యాక్ట్ చేశాడు. సాహు గార్లపాటి నిర్మించిన లైలా మూవీ వాలెంటైన్ డే సందర్భంగా ఫిబ్రవరి 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలోనే ఆదివారం (ఫిబ్రవరి 9) హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‎కు లైలా సినిమాలో యాక్ట్ చేసిన 30 ఇయర్స్ పృథ్వీ హాజరయ్యాడు. ఈ  సందర్బంగా పృథ్వీ మాట్లాడుతూ.. సినిమాలో తన పాత్ర గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పాడు.

అసలు పృథ్వీ ఏమన్నారంటే..?

లైలా సినిమాలో తన క్యారెక్టర్ పేరు మేకల సత్తి అని చెప్పాడు పృథ్వీ. అలాగే.. సినిమాలో తనకు సంబంధించిన ఒక డైలాగ్‎ను కూడా రివీల్ చేశాడు పృథ్వీ. ఓ సన్నివేశంలో..  ఇక్కడ ఎన్ని మేకలు ఉన్నాయని నన్ను అడుగుతారు.. అప్పుడు నేను 150 అని చెపుతాను.. కానీ సినిమా చివరిలో లెక్కిస్తే.. 11 గొర్రెలు మాత్రమే ఉన్నాయంటూ పృథ్వీ కామెంట్స్ చేశారు. పృథ్వీ చేసిన ఈ వ్యాఖ్యలే వివాదానికి ఆజ్యం పోశాయి. పృథ్వీ కామెంట్స్ పరోక్షంగా వైసీపీని ఉద్దేశించి చేసినట్లుగా ఉన్నాయని జగన్ అభిమానులు, ఆ పార్టీ సానుభూతిపరులు మండిపడుతున్నారు. 

2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ నేతృత్వంలోని వైసీపీ 151 సీట్లు సాధించి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. 2019లో అఖండ విజయం సాధించిన వైసీపీకి ఐదేళ్లు తిరిగే సరికి బిగ్ షాక్ తగలింది. 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కేవలం 11 సీట్లకే వైసీపీ పరిమితమై అధికారం పోగుట్టుకుంది. ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకునే పృథ్వీ పరోక్షంగా వైసీపీని కామెంట్స్ చేశాడని సోషల్ మీడియాలో వైసీపీ అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఫైర్ అవుతున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో బైకాట్ లైలా మూవీ అంటూ పోస్ట్ లు పెడుతున్నారు. ఈ వివాదంతో #BoycottLaila హాష్‌ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ మారింది.