తండ్రి తెలుగు.. తల్లి మలయాళీ.. కానీ ఆమె పుట్టింది మాత్రం తమిళనాడులో..
అందుకేనేమో.. అన్ని భాషల్లోనూ ఒక వెలుగు వెలిగిపోయింది.
బాల నటిగా కెరీర్ స్టార్ట్ చేసింది. స్టార్ హీరోయిన్‌గా చక్రం తిప్పింది.
ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా, రియాలిటీ షోష్ కు జడ్జిగా వ్యవహరిస్తోంది.
మీనాల్లాంటి కళ్లను గిరగిరా తిప్పుతూ తన పర్ఫార్మెన్స్ తో ఇంప్రెస్ చేసే ఆ నటి మరెవరో కాదు.. మీనా
ఇవాళ తన పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమె గురించి కొన్ని విషయాలు..
1976 సెప్టెంబర్ 16వ తేదీన మీనా మద్రాస్‌లో జన్మించారు. ఆమె తండ్రి తెలుగు వ్యక్తి. తల్లి మలయాళీ. ఓ బర్త్ డే పార్టీలో మీనాను చూసిన నటుడు శివాజీ గణేషన్ తన సినిమాలో అవకాశం ఇచ్చారు. అలా1982లో బాలనటిగా కెరీర్ స్టార్ట్ చేశారు మీనా. ఆ తర్వాత శివాజీ గణేషన్ యాక్ట్ చేసిన చాలా సినిమాల్లోనూ చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించారు. రజినీకాంత్‌తోనూ రెండు సినిమాలు చేశారు. ఇటు తెలుగులోనూ చాలా ఆఫర్స్ వచ్చాయి. హిందీ, మలయాళ భాషల్లోనూ చిన్న వయసులోనే ఎంట్రీ ఇచ్చారు. దాదాపు 50 సినిమాల్లో నటించి చైల్డ్ ఆర్టిస్టుగానే స్టార్‌డమ్ చూశారామె.
రాజేంద్రప్రసాద్ లీడ్ రోల్ చేసిన ‘నవయుగం’ సినిమాతో మీనా హీరోయిన్‌గా మారారు. అదే ఏడాది తమిళంలోనూ ఫిమేల్ లీడ్‌గా ఎంట్రీ ఇచ్చారు. టాలీవుడ్‌లో ‘సీతారామయ్యగారి మనవరాలు’, కోలీవుడ్‌లో ‘ఒరు పుదియ కాదల్’ సినిమాలు మీనాకు మంచి బ్రేక్ ఇచ్చాయి. ఇక వరుస అవకాశాలతో బిజీ అయిపోయారు. సౌత్ టాప్ హీరోయిన్స్ లో ఒకరిగా మారారు.
తెలుగులో తిరుగులేని స్టార్‌డమ్ మీనాది. చంటి, సుందరకాండ సినిమాల్లో ఇన్నోసెంట్‌గా కనిపించి ప్రేక్షకులను అలరించారు. ప్రెసిడెంట్ గారి పెళ్లాం, కొంగుచాటు కృష్ణుడు, అల్లరి పిల్ల సినిమాల్లో చిలిపిగా ఆకట్టుకున్నారు. రాజేశ్వరీ కళ్యాణం, మొరటోడు నా మొగుడు లాంటి సినిమాల్లో ఎమోషనల్‌గా నటించి.. మెప్పించారు. పెళ్లాం చెబితే వినాలి, అబ్బాయిగారు లాంటి సినిమాల్లోనూ డ్యాషింగ్ లేడీగానూ సత్తా చాటారు.
సెకెండ్ ఇన్నింగ్స్ లో మీనా కాస్త సెలెక్టివ్‌గా ఉంటున్నారు. తన ఇమేజ్‌కు తగ్గ పాత్రలు వస్తేనే చేస్తున్నారు. ‘దృశ్యం’ సినిమాలోని పాత్ర తనకి చాలా మంచి పేరు తెచ్చింది. అలాగే.. టెలివిజన్ ఫీల్డ్లోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. లక్ష్మీ, కల్యాణం, అనుబంధాలు లాంటి సీరియల్స్ లో నటించారు. రియాలిటీ షోస్ కు జడ్జిగారూ వ్యవహరిస్తున్నారు. ‘కరొలిన్ కామాక్షి’ అనే వెబ్ సిరీస్‌లోనూ నటించారు. మీనాలో ఓ సింగర్ కూడా ఉన్నారు. యాక్టర్ మనోజ్ కె భారతితో కలిసి కొన్ని పాటలు పాడారు. రెండు పాప్ ఆల్బమ్స్ కు మ్యూజిక్ కంపోజ్ చేశారు. పాడారు కూడా.
2009లో మీనా బెంగళూరుకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ విద్యాసాగర్ ను వివాహం చేసుకున్నారు. వీరికి నైనిక అనే కూతురు ఉంది. అమ్మలాగే చైల్డ్ ఆర్టిస్ట్ గా నైనిక సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది. ఐదేళ్ల వయసులో హీరో విజయ్ నటించిన ‘తేరి’ సినిమాలో నటించి మెప్పించింది. లైఫ్ అంతా సాఫీగా ఉందనుకున్న సమయంలో మీనా జీవితంలో పెద్ద కుదుపు ఏర్పడింది. ఈ ఏడాది జూన్‌లో మీనా భర్త అనారోగ్యంతో మరణించడంతో విషాదంలో మునిగిపోయారు మీనా.