
'అభిమానులు'.. వీరిది ప్రత్యేక శైలి. ఇందులో మంచోళ్ళు ఉంటారు. పిచ్చోళ్ళు ఉంటారు. కొంతమంది మూర్ఖులు కూడా ఉంటారు. వీరిని పక్కనబెడితే అభిమానులే నటులకి కొండంత బలం. వారు తమ అభిమాన నటుల పేరుతో చేసే సామాజిక కార్యక్రమాలు ఎంతో స్ఫూర్తినిస్తాయి.
అలాగే, నటుల్ని కలవడం కోసం చేసే ప్రయాణాలు కూడా ఇతర అభిమానులకు ఊతం ఇస్తాయి. ఇలా ఒక్కొక్కరు ఒక్కోలా తమ అభిమానాన్నని చాటుతూ ముందుకెళతారు. ఇపుడీ అలా ఓ అభిమాని తమ అభిమాన నటి కోసం చేసిన పనికి తమ తోటి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. వివరాల్లోకి వెళితే..
హీరోయిన్ సమంత కోసం ఓ అభిమాని ఏకంగా గుడి కట్టారు. గుంటూరు జిల్లా చుండూరు మండలం ఆలపాడుకు చెందిన తెనాలి సందీప్ కు సమంత అంటే చచ్చేంత ఇష్టం. ఆమె నటన మాత్రమే కాదు, ఆమె చేసే సామజిక సేవా కార్యక్రమాలకు తనపై అభిమానం ఏర్పరుచుకున్నారు.
ఈ క్రమంలోనే సమంత పుట్టిన రోజు నాడు (ఏప్రిల్ 28న) వినూత్నంగా ఆమెకు శుభాకాంక్షలు తెలియజేసాడు. తన స్వంత ఇంటిలోనే సమంతకు గుడి కట్టి పూజ చేస్తున్నాడు.
2023లోనే సమంత పుట్టిన రోజు సందర్భంగా తెనాలిలో ఆమె విగ్రహాన్ని తయారు చేయించి విగ్రహావిష్కరణ చేయించారు. అప్పటి నుంచి ఆమె గుడిలో ప్రతి ఏటా ఆమె పుట్టిన రోజు నాడు అన్నదానం నిర్వహిస్తూన్నాడు. అనాధ బాలబాలికలు, వృద్దులకు అన్నం పెట్టి తన అభిమానాన్ని చాటుకుంటూ వస్తున్నాడు.
A fan named Sandeep honored actress #SamanthaRuthPrabhu by building a temple in Bapatla ! @Samanthaprabhu2 pic.twitter.com/4DnmcRdMfj
— Let's X OTT GLOBAL (@LetsXOtt) April 28, 2025
అయితే, సందీప్ చేస్తున్న అభిమాన పూజకు నెటిజన్ల నుంచి భిన్నమైన కామెంట్స్ వినిపిస్తున్నాయి. కన్నతల్లికి అన్నం పెట్టి, కడుపరా చూసుకుంటూ చాలు. ఇలా కోట్లు సంపాదించే తారల కోసం చేస్తే ఏం వస్తుంది? ఇదే అన్నదానం తన తల్లి పేరు మీద, తన బిడ్డలపేరు మీద చేస్తే ఇంకా బాగుండని మరికొందరు సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు. ఇకపోతే, సమంతకు సౌత్, నార్త్ భాషల్లో విపరీతమైన ఫ్యాన్స్ ఉన్నారు. అందులో ఈ సందీప్ ఒకరు.