
ఖమ్మం టౌన్, వెలుగు: ఖమ్మం జిల్లాలో వరద బాధితుల సహాయార్థం రాజ్యసభ సభ్యుడు, హెటిరో ఫార్మ అధినేత బండి పార్థసారథి రెడ్డి రూ. కోటి విరాళంగా అందించారు. గురువారం కలెక్టర్ ముజామిల్ ఖాన్‌ను కలిసి చెక్కు ఇచ్చారు. తన సొంత జిల్లా ఖమ్మం ప్రజలు వరదల కారణంగా ఇబ్బంది పడుతున్నందున తమ సింధు హాస్పిటల్ తరఫున ఉచితంగా మందులు, వరద ప్రాంతాల్లో వాడుకునేందుకు రెండు అంబులెన్స్‌లను కూడా అందించామని.. అవసరమైతే మరిన్ని మందులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని పార్థసారథి రెడ్డి చెప్పారు. ఏపీ ముఖ్యమంత్రి సహాయ నిధికి కూడా రూ. కోటి విరాళంగా ఇస్తున్నట్టు ఆయన ప్రకటించారు. ఎన్నారైలు కూడా ప్రజలను ఆదుకునేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఉన్నారు.