ములుగు జిల్లాలో జల ప్రళయం... ఐదుగురు గల్లంతు

ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి.  ములుగు జిల్లాలో జలప్రళయం కొనసాగుతోంది.   గడిచిన 24 గంటల్లో వరదల్లో గల్లంతై ఐదుగురు మృతి చెందారు. చనిపోయిన వారిలో.ఎస్.కే మైబూబ్ ఖాన్. (50), ఎం.డి. అజ్జు (20), మజీద్ సాబ్ (70) గా గుర్తించారు. మరో ఇద్దరి వివరాలు తెలియాల్సి ఉంది. రోడ్డు దాటుతుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. 

 ఇక జిల్లా వ్యాప్తంగా 245 పశువుల మృత్యువాత పడ్డాయి.  వర్షాల ప్రభావానికి 13 ఇళ్లు పూర్తిస్థాయిలో నేల మట్టం కాగా  , పాక్షికంగా 64 ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఇక వర్ష బీభత్సానికి నాలుగు రోడ్లు ధ్వంసం కాగా ఒక చెరువు తెగిపోయింది. దీంతో రాకపోకలు బంద్ అయిపోయాయి.  

మరోవైపు  మేడారం గ్రామాన్ని వరద ముంచేసింది.  జంపన్నవాగునకు వరద పోటెత్తింది.  దీంతో  మేడారం సమ్మక్క సారక్క గద్దెల వరకు నీరు వచ్చి చేరింది. మేడారం ప్రాగణం  జలదిగ్బధంలో చిక్కుకుంది.  గత రాత్రినుంచే జంపన్నవాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. 

సమ్మక్క సారక్క జాతర జరిగే ప్రాతంలోని దుకాణాలు నీట మునిగాయి.  షాపుల్లోకి భారీగా నీరు చేరి సామాన్లు తడిచిపోయాయి.  దీంతో లక్షల రూపాయల నష్టం వాటిల్లిందని వ్యాపారులు అంటున్నారు.