మేడ్చల్లో మునిగిన హాస్టల్ అపార్ట్మెంట్స్..(వీడియో)

మేడ్చల్లో మునిగిన హాస్టల్ అపార్ట్మెంట్స్..(వీడియో)

వర్ష బీభత్సానికి మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా  మైసమ్మగూడలో ఉన్న పలు ప్రైవేటు హాస్టళ్లు నీటిలో మునిగిపోయాయి. హాస్టళ్ల ముందు మోకాళ్ల కంటే ఎక్కువ లోతులో నీరు ప్రవహిస్తుండటంతో..విద్యార్థులంతా హాస్టళ్లలోనే చిక్కుకుపోయారు. హాస్టళ్ల సెల్లార్లోకి కూడా నీరు చేరింది. దీంతో విద్యార్థులు బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. 

గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని మైసమ్మ గూడలోని  మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల, సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కళాశాల, నర్శింహా రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు ఈ హాస్టళ్లలోనే ఉంటున్నారు. అయితే అర్థరాత్రి వర్షం దంచికొట్టడంతో ఈ హాస్టళ్లను వరద చుట్టుముట్టింది. మైసమ్మగూడ మొత్తం వరద దిగ్భంధంలో చిక్కుకుపోయింది. దీంతో హాస్టళ్లలో ఉంటున్న వేలాది మంది విద్యార్థుల అక్కడే చిక్కుకుపోయారు. 

విద్యార్థుల కోసం స్థానిక అధికారులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. జేసీబీ సాయంతో విద్యార్థులను బయటకు తీసుకొస్తున్నారు. హాస్టల్ గదుల్లో బిక్కు బిక్కు మంటూ కూర్చున్న విద్యార్థులను కాపాడుతున్నారు.   

భారీ వర్షానికి మైసమ్మ గూడలోని అపార్ట్మెంట్లలోకి వరద నీరు చేరింది. అనేక బిల్డింగ్ లలోని మొదటి అంతస్తు మేర వరద ప్రవహిస్తోంది. దీంతో అపార్ట్మెంట్లో నివసిస్తున్న వారంతా చిక్కుకుపోయారు. బయటి ప్రపంచంతో అపార్ట్మెంట్ వాసులకు సంబంధాలు తెగిపోయాయి. దీంతో తమను కాపాడాలని అపార్ట్మెంట్ వాసులు కోరుతున్నారు.