Hassan Nasrallah: హెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లాను చంపేశాం.. ఇజ్రాయెల్ ప్రకటన

Hassan Nasrallah: హెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లాను చంపేశాం.. ఇజ్రాయెల్ ప్రకటన

బీరట్: హెజ్బొల్లా మిలిటెంట్స్ గ్రూప్ చీఫ్ హసన్ నస్రల్లాను (64) బీరట్లో అంతమొందించినట్లు ఇజ్రాయెల్ సైన్యం శనివారం (సెప్టెంబర్ 28, 2024) ప్రకటించింది. శుక్రవారం రాత్రి నుంచి నస్రల్లాతో కమ్యూనికేషన్ నిలిచిపోయినట్లు హెజ్బొల్లా గ్రూప్తో సన్నిహితంగా ఉన్న విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ‘‘హసన్ నస్రల్లా చనిపోయాడు’’ అని మిలిటరీ లెఫ్టినెంట్ కల్నల్ నదవ్ శోషాని తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేశారు. అంతేకాదు.. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ‘ఎక్స్’ ఖాతాలో కూడా నస్రల్లా చనిపోయినట్లు ఇజ్రాయెల్ అధికారికంగా ప్రకటన చేసింది. ‘‘హసన్ నస్రల్లా ఇకపై ఈ ప్రపంచాన్ని భయోత్పాతం సృష్టించలేడు’’ అని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేయడం గమనార్హం.

ఉత్తర, దక్షిణ లెబనాన్లోని హెజ్బొల్లా మిలిటెంట్ గ్రూప్ స్థావరాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసిన సంగతి తెలిసిందే. దక్షిణ బీరట్లోని హెజ్బొల్లా స్థావరాలను రాత్రికి రాత్రే ఇజ్రాయెల్ జెట్స్ నేలమట్టం చేశాయి. ఇంతటితో అయిపోయిందనుకోకండి. ఈ సందేశం సాధారణంగానే అనిపించొచ్చు. కానీ.. ఇజ్రాయెల్ పౌరులను ఎవరైనా భయపెట్టాలని చూస్తే వాళ్లను చేరుకుని తుదముట్టించడం ఎలానో మాకు తెలుసు’’ అని ఇజ్రాయెల్ లెఫ్టినెంట్ జనరల్ హెర్జీ హలేవి ఒక ప్రకటనలో ఉగ్రవాదులను హెచ్చరించారు.

ఇదిలా ఉండగా.. నస్రల్లా కూతురు జైనాబ్ నస్రల్లా కూడా దక్షిణ బీరట్పై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో చనిపోయినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఆమె చనిపోయినట్లుగా హెజ్బొల్లా గ్రూప్ కానీ లెబనీస్ మీడియా గానీ ధ్రువీకరించలేదు. 2006లో లెబనాన్పై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో  హసన్ నస్రల్లా చనిపోయినట్లుగా పుకార్లొ్చ్చాయి. కానీ.. ఇజ్రాయెల్ దాడుల నుంచి తప్పించుకుని నస్రల్లా అప్పట్లో సురక్షితంగా బయటపడ్డాడు. హెజ్బొల్లా గ్రూప్కు హసన్ నస్రల్లా సెక్రటరీ జనరల్గా ఉన్న 32 ఏళ్లలో ఎంతో మంది ఇజ్రాయెల్ సైనికులు, పౌరులను పొట్టనపెట్టుకున్నాడని ఇజ్రాయెల్ ఒక ప్రకటనలో పేర్కొంది. వేల కొద్దీ ఉగ్రవాద చర్యలకు ప్లాన్ చేసి నాయకత్వం వహించాడని తెలిపింది. ఇదిలా ఉండగా.. హెజ్బొల్లా గ్రూప్ను అంతమొందించడమే లక్ష్యంగా పెట్టుకుని లెబనాన్పై ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల్లో 700 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 1, 18,000 మందికి పైగా నిరాశ్రయులుగా మిగిలిపోయారు. 

ALSO READ | Hurricane Cyclone : హరికేన్ విధ్వంసం.. 44 మంది మృతి

ఇజ్రాయెల్‌‌, హెజ్బొల్లా మధ్య సంధి కుదిర్చేందుకు అమెరికా, ఫ్రాన్స్‌‌ తీవ్రంగా ప్రయత్నించాయి. దాడులకు విరామం ఇవ్వాలని కోరాయి. ఈ మేరకు మొత్తం 12 దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాలని తీర్మానించాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ మాక్రన్ సంయుక్తంగా ప్రకటన విడుదల చేశారు. ‘‘సాధారణ పౌరుల భద్రత గురించి ఇజ్రాయెల్, లెబనాన్ ఆలోచించాలి. ఏడాది కాలంగా ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నారు. వారం నుంచి దాడులు ముమ్మరం చేశారు. 21 రోజుల పాటు కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమలు చేయండి. సాధారణ పౌరులంతా సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు టైమ్ ఇవ్వండి. దాడుల వల్ల పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి’’అని బెడెన్, మాక్రన్ కోరినా నెతన్యాహు పెడచెవిన పెట్టారు.