కరోనా కేసులు, ఆక్సిజన్ సరఫరాకు సంబంధించి వాస్తవాలకు దూరంగా సాగుతున్న చర్చ.. ఆస్పత్రుల సరఫరా వ్యవస్థలో వైఫల్యాలకు కేంద్ర ప్రభుత్వంపై నిందలు మోపుతూ కీలక వాస్తవాన్ని విస్మరించేదిగా ఉంది. ‘‘దేశంలోని ఐదోవంతు జిల్లాల్లో వారం రోజులుగా కరోనా కేసు ఒక్కటి కూడా నమోదు కాలేదు. దీన్నిబట్టి కరోనా చైన్‌ను మనం సరళస్థాయికి తెచ్చినట్లు భావించవచ్చు’’ అని కేంద్ర మంత్రి హర్షవర్ధన్ ఫిబ్రవరి 15న ప్రకటించారు. అయితే, ఏప్రిల్‌లో కేసులు అనూహ్యంగా విపత్కర స్థాయికి చేరాయి. ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనడానికి జాతీయ స్థాయిలో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అయితే, ఢిల్లీలో ఆక్సిజన్ కొరత వల్ల దురదృష్టవశాత్తూ సంభవించిన మరణాలు మొత్తం వాతావరణాన్ని భావోద్వేగ స్థితిలోకి నెట్టాయి. దీంతో అన్ని వాస్తవాలు మరుగునపడ్డాయి. ఇది ప్రజల్లో చర్చను తప్పుదోవ పట్టించగా, కరోనా గురించి వక్రీకృత కథనాలు వెలువడ్డాయి. దీంతో కరోనా సవాల్‌ను ఎదుర్కొనే జాతీయ సంకల్పానికి గండిపడే పరిస్థితి ఎదురైంది. ఈ నేపథ్యంలో మరుగునపడిన కీలక వాస్తవాలేమిటో చూద్దాం..
ఆక్సిజన్ కొరత వల్ల తొలుత సంభవించిన మరణాలు ఢిల్లీలోని కార్పొరేట్ ఆస్పత్రుల్లో చోటు చేసుకున్నవే. అప్పటికే భారీ లాభాలను ఆర్జించిన ఈ ఆస్పత్రులు మహమ్మారి కారణంగా నిరుడు మరింత లాభాలను రాబట్టాయి. దీనిపై నేషనల్ హెరాల్డ్ వెబ్‌సైట్ ‘‘కరోనా వేళ లాభాలు: ప్రైవేటు ఆస్పత్రుల స్వాధీనానికి సమయం ఆసన్నమైందా?’’ శీర్షికతో 20.6.2020న ఒక వ్యాసం ప్రచురించింది. ఈ వ్యాసంలో ‘‘రూ.25,090, రూ.53,090, రూ.75,590, రూ.5,00,000, రూ.6,00,000, రూ.12,00,000.. కరోనా పీడితుల నుంచి ఒక పడకకు రోజువారీగా, రెండు వారాలకు కలిపి ఢిల్లీలోని ప్రైవేటు ఆస్పత్రులు వసూలు చేసిన చార్జీలు’’ అని పేర్కొంది. ఇండ్లలో ఉండి చికిత్స పొందిన వారికీ ఖర్చు తక్కువేమీ కాలేదు. ఇది వివిధ పరీక్షలు సహా రోజుకు రూ.5,700 నుంచి రూ.21,900 దాకా వెళ్లింది. ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీపై సుప్రీం ఇచ్చిన ఉత్తర్వును ‘ది హెరాల్డ్’ ప్రస్తావించింది. ఈ ఉత్తర్వులతో అప్రమత్తమైన ఆరోగ్య సంరక్షణ సేవాప్రదాతల సంఘం(ఏహెచ్‌పీ), ఫిక్కి సభ్య సంస్థలు స్వీయ నియంత్రణకు అంగీకరించాయి. మరి స్వీయ నియంత్రణ కింద నిర్ణయించిన రుసుములు ఎలా ఉన్నాయి? సాధారణ వార్డులకు ఏహెచ్‌పీలు రోజుకు రూ.15,000 కాగా, దీనికి అదనంగా ఆక్సిజన్ కోసం రూ.5,000గా నిర్ణయించాయి. అలాగే ఐసీయూల్లో రూ.25,000, వెంటిలేటర్ కోసం రూ.10,000 వంతున నిర్దేశించాయి. ఇక ఫిక్కి పరిధిలో రుసుములు మరింత అధికంగా- అంటే రోజుకు రూ.17,000 నుంచి రూ.45,000 దాకా ఉన్నాయి. ఈ ఆస్పత్రులు వ్యక్తిగత రక్షణ సామగ్రి కిట్ ఒక్కొక్కటి రూ.375 నుంచి -500 వంతున కొంటూ వాటిని 10 నుంచి 12 రెట్లు అధిక ధరకు అమ్ముకుంటున్నాయి. ఒక్క ఢిల్లీలోనే కాదు... చెన్నై, ముంబై సిటీలు కూడా ఈ దోపిడీకి మినహాయింపు కాదని హెరాల్డ్ పేర్కొంది.
ఆక్సిజన్ తయారీ.. కంట్రోల్ లేదు
ఆక్సిజన్ తయారీ, నిల్వ, వ్యాపారం, వినియోగం తదితరాలన్నీ పూర్తిగా ప్రైవేటుకు అప్పగించారు. అలాగే దేశంలో వైద్యపరమైన ఆక్సిజన్ ధరను కేంద్ర రసాయనాలు-ఎరువుల మంత్రిత్వశాఖ పరిధిలోని ‘జాతీయ ఔషధ ధరల నియంత్రణ ప్రాధికార సంస్థ’(ఎన్‌పీపీఏ) నియంత్రిస్తున్నా.. దీని వ్యాపారంపై ఎలాంటి నియంత్రణ, అదుపు లేవు. తయారీదారులు ఆక్సిజన్ సరఫరాపై పరిశ్రమలు, ఆస్పత్రులు.. చివరకు ప్రభుత్వాలతోనూ ప్రైవేటుగా కాంట్రాక్టు కుదుర్చుకుంటారు. అత్యవసర స్థితిలో తమకు ఎంత ఆక్సిజన్ అవసరమో ఆస్పత్రులు ప్రణాళిక వేసుకుంటాయి. కానీ కరోనా సెకండ్ వేవ్ ముప్పు ఉందని కేంద్రం హెచ్చరిస్తున్నా ఏ ఒక్క చోటా ముందస్తు ప్లానింగ్ కనిపించలేదు.
ప్లాంట్ల ఏర్పాటును అడ్డుకున్న ఆస్పత్రులు
ఇటువంటి పరిస్థితిని ముందుగానే ఊహించిన మోడీ ప్రభుత్వం నిరుడే దేశంలోని వివిధ ప్రభుత్వ ఆస్పత్రుల్లో 162 పీఎస్ఏ ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుకు ఆదేశాలిచ్చింది. ఈ మేరకు రూ.200 కోట్లకుపైగా వ్యయంతో వీటి నిర్మాణానికి నిరుడు అక్టోబర్లో ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి ప్లాంటులో రోజుకు సుమారు ఒక టన్ను ద్రవీకృత ఆక్సిజన్ ఉత్పత్తయ్యేది. అయితే, 162 ప్లాంట్లకుగాను 33 మాత్రమే ఏర్పాటయ్యాయి. ఎక్కడికక్కడ ఆక్సిజన్ తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేసుకోవాలన్న కేంద్రం ప్రణాళికను కొన్ని రాష్ట్ర ప్రభుత్వ ఆస్పత్రులు అడ్డుకున్నాయి. చాలా ఆస్పత్రులు తమకు ‘తగినంత స్థలం లేద’నే సాకుతో సుముఖత చూపలేదు. కొనుగోలు చేయడం ద్వారా కలిగే ‘లబ్ధి’పైనే ఆసక్తి చూపడం దీని వెనక ఉన్న అసలు వాస్తవం. పరస్పర ఆరోపణలు, విమర్శల నడుమ ప్రభుత్వం ముందుచూపుతో తీసుకున్న నిర్ణయం గురించి ఎవరికైనా వినిపించిందా?
ఇది కరోనా కొత్త మ్యూటెంట్
ప్రస్తుతం దేశంలో వ్యాపిస్తున్నది పూర్తిగా కొత్త కరోనా మ్యూటెంట్ అన్నది నిజం. ఆ మేరకు మార్చి తొలి వారం నుంచి కరోనా లైన్ పైపైకి పెరగసాగింది. ఏప్రిల్ తొలి రెండు వారాలు గడిచేసరికి సునామీగా పోటెత్తింది. ఏడు వారాల వ్యవధిలో బీహార్‌లో రోజువారీ కేసులు 522 రెట్లు పెరిగాయి. అలాగే యూపీలో 399 రెట్లు, ఆంధ్రప్రదేశ్‌లో 186 రెట్లు, ఢిల్లీ, జార్ఖండ్‌లో 150 రెట్ల వంతున, పశ్చిమబెంగాల్లో 142 రెట్లు చొప్పున కేసులు విజృంభించాయి. ఇది అత్యంత భారీ విపత్తు.. ఎవరి ఊహకూ అందని సునామీ. ఇది కొత్త వైరస్ రకం.. మునుపు కరోనా ఫస్ట్ వేవ్ వ్యాపించిన ప్రతి చోటా ఇది పుట్టింది. ఎలాంటి నిపుణుడైనా దీన్ని అంచనా వేయడం అసాధ్యం.
వ్యాక్సిన్‌పై అనవసర అపోహలు
ఈ సునామీని ఎదుర్కొనడానికి సమష్టి సంకల్పం, ఉమ్మడి బాధ్యత ఎంతో అవసరం. అదే సమయంలో వాస్తవాలు విస్మరించకుండా, చర్చ పక్కదోవ పట్టి ఇతరుల మీదకు నిందవేసే పరిస్థితికి తావుండకూడదు. అత్యవసర వినియోగం కోసం ‘కోవాగ్జిన్’ టీకాకు ప్రభుత్వం ఆమోదం తెలపడంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించడం ఈ సమష్టి బాధ్యత లోపానికి నిదర్శనం. ఫలితంగా ప్రజలు టీకా తీసుకోవడానికి వెనుకాడారు. ఈ ఏడాది జనవరిలో 33 శాతం మంది మాత్రమే టీకా తీసుకోగా, 40 శాతం మంది వేచిచూడాలని నిర్ణయించుకున్నారు. మరో 16 శాతం టీకా వద్దన్నారు. మార్చిలో టీకా వేసుకునేందుకు రెడీగా ఉన్నవారు 57 శాతానికి పెరగ్గా, వేచి చూద్దామన్నవారు సగం తగ్గారు. వద్దనేవారి సంఖ్య కూడా 6 శాతానికి దిగివచ్చింది. ఈ క్రమంలో విలువైన మూడు నెలల కాలం వృథా అయింది. రోజుకు సగటున 30 లక్షల వంతున టీకాలు వేయగలిగితే నెలకు 9 కోట్ల మందికి రోగనిరోధకత సమకూరుతుంది. కానీ, మార్చి దాకా తొలి మోతాదు టీకా తీసుకున్నవారి సంఖ్య 10.8 కోట్లు కాగా, 1.6 కోట్ల మంది రెండో మోతాదు వేసుకున్నారు.
జాతీయ సంకల్పం అవసరం
టీకాపై సందేహాలకు తావులేనట్లయితే వ్యాక్సిన్ వేసుకున్న వారి సంఖ్య రెట్టింపుగా నమోదై ఉండేది. అంతేగాక ఒక జాతిగా మనం స్వీయ రక్షణను వదులుకున్నాం. గూగుల్ మొబిలిటీ లెక్కలు చెబుతున్న మేరకు కరోనా పరిస్థితులు కొనసాగుతున్నా, మనం సాధారణ జీవితం గడపటానికే మొగ్గు చూపాం. ఆ మేరకు లాక్ డౌన్ పరిస్థితులకు ముందునాటితో పోలిస్తే ఆ తర్వాత 78 శాతం వినోదాల్లో, 87 శాతం పార్కులు, -బహిరంగ ప్రదేశాల్లో, 92 శాతం రవాణాలో, 120 శాతం దాకా షాపింగ్ కార్యకలాపాల్లో సమయం గడిపాం. పైగా ఫిజికల్ డిస్టెన్స్ పాటించడం, మాస్క్ పెట్టుకోవడం చాలావరకూ నిర్లక్ష్యం చేశాం. ఇక మనముందున్నది పెనుసవాల్‌ను ఎదుర్కోవాల్సిన పరిస్థితే. ఇప్పటికైనా మనకు జాతీయ ఉమ్మడి సంకల్పం అవసరం.. మరి మనకు ఆ సత్తా ఉందా? లేదా? తేల్చుకోవాల్సింది మనమే!
.......ఎస్.గురుమూర్తి,తుగ్లక్ పత్రిక ఎడిటర్
ముందే హెచ్చరికలు వచ్చాయి
ఆక్సిజన్ సరఫరా వ్యవస్థలోని సమస్యల గురించి పోయినేడాది కేరళలోని త్రిస్సూర్‌లోగల జూబిలీ మిషన్ మెడికల్ కాలేజీ అండ్ రీసెర్చి ఇన్‌స్టిట్యూట్ ఎక్స్పర్ట్స్ చెరిష్ పాల్, జాన్ పాల్, అఖిల్ బాబు స్పష్టంగా నివేదించారు. ఆస్పత్రుల్లో అధికశాతం ఒకే ప్రదేశం నుంచి ఒకే మార్గం ద్వారా ఆక్సిజన్ సరఫరాపై ఆధారపడి ఉన్నాయని తేల్చారు. ఇది విపత్కర సమయాల్లో ఆపద కొనితెచ్చుకోవడమే అవుతున్నదని హెచ్చరించారు. ఈ ఇబ్బంది తొలగాలంటే ఆస్పత్రి పరిమాణం, ద్రవ ఆక్సిజన్ ప్లాంట్ సామీప్యం ప్రాతిపదికన వివిధ మార్గాలను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. ఢిల్లీలోని ఆస్పత్రులకూ ఈ హెచ్చరిక వర్తిస్తుంది. అవి తమకుతాముగా ఆక్సిజన్ ఉత్పత్తి చేసుకోవచ్చు.. కానీ, అలా చేయడం లేదు. విపత్కర సమయాల్లో ఆక్సిజన్ నిరంతర సరఫరాపై వాటివద్ద ఎలాంటి ప్రణాళికా లేదు. ఆక్సిజన్ సరఫరా అందకపోతే మాత్రం వాటికి రాజ్యాంగం ప్రసాదించిన ‘జీవించే హక్కు’ గుర్తుకొస్తుంది. ఆ మేరకు ఆక్సిజన్ సరఫరాపై ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలని కోర్టు గడప తొక్కుతాయి. వాస్తవాలు అందుబాటులో లేకపోవ డంతోపాటు కోర్టు భావోద్వేగ స్పందన ఈ మొత్తం నిందను ప్రభుత్వాలపై నెట్టడానికి దోహదపడింది.
ఆక్సిజన్ కొరత లేదు
దేశంలో వాస్తవానికి ఆక్సిజన్ కొరత లేదు. మనం రోజుకు 1,00,000 టన్నుల మేర ఉత్పత్తి చేస్తుండగా, గుజరాత్‌లోని ఓ కంపెనీయే ఇందులో ఐదో వంతు తయారు చేస్తుంది. అయితే, దీనిలో ఒక్క శాతం మాత్రమే మెడికల్ ఆక్సిజన్. ప్రస్తుత కరోనా టైమ్‌లోనూ ఇది 5 -6 శాతానికి మించదు. ద్రవరూప ఆక్సిజన్ వ్యాపారం భారీ, సురక్షిత ట్యాంకర్ల ద్వారా సాగుతూంటుంది. ఇవి ఒక్కొక్కటి రూ.45 లక్షలు చేస్తాయి. ఘోరమైన విషయమేమిటంటే- ఒక సిలిండరులో నిల్వ చేసిన రూ.300 విలువచేసే ఆక్సిజన్‌కు ఏకంగా రూ.10,000 వంతున వసూలు చేస్తున్నారు. సుదూర ప్రాంతాల్లో ఉత్పత్తి, ట్యాంకర్లలో రవాణా, సిలిండర్లలో నిల్వ తదితర భారీ సదుపాయాల సమస్యలు సాధారణ సమయాల్లోనే వ్యయప్రయాసలతో కూడినవిగా ఉంటాయి.