ఆపరేషన్ కర్రె గుట్ట ఫెయిల్.. తప్పించుకున్న హిడ్మా దళం..!

ఆపరేషన్ కర్రె గుట్ట ఫెయిల్.. తప్పించుకున్న హిడ్మా దళం..!
  • కర్రెగుట్టల్లో భారీ బంకర్
  • వెయ్యి మంది మావోయిస్టులు ఉండడానికి వీలుగా నిర్మాణం
  • నీళ్లు సహా ఇతర సౌలతులూ ఉన్నట్టు గుర్తించిన పోలీసులు 
  • అడవుల్లో ఆరు రోజులుగా కొనసాగుతున్న కూంబింగ్‌‌
  • భద్రతా బలగాల రాకను పసిగట్టి తప్పించుకున్న హిడ్మా దళం 
  • కర్రె గుట్టలపైకి చేరుకుంటున్న బ్యాకప్‌‌‌‌ పోలీసులు

జయశంకర్‌‌‌‌ భూపాలపల్లి/వెంకటాపురం, వెలుగు: కర్రె గుట్టల్లో మావోయిస్టుల కోసం కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులు.. అక్కడ శనివారం రాత్రి భారీ బంకర్‌‌ను గుర్తించారు. దాన్ని వెయ్యి మందికి పైగా మావోయిస్టులు ఉండడానికి వీలుగా నిర్మించారని.. అందులో నీళ్లు సహా ఇతర సౌకర్యాలు ఉన్నాయని నిర్ధారించారు. మావోయిస్టులు కొన్ని నెలల పాటు ఈ సొరంగంలోనే తలదాచుకున్నట్టు గుర్తించారు.

ఇక్కడ గతంలో మనుషులు నివసించినట్టు.. బంకర్‌‌‌‌లో నీటి వసతి, ఇతర సౌకర్యాలు ఉన్నట్టు పోలీసులకు స్పష్టమైన ఆధారాలు లభించాయి. మావోయిస్టులు అనేక దశాబ్దాలుగా కర్రెగుట్టలను సేఫ్ జోన్‌‌గా ఉపయోగిస్తున్నారు. సుమారు 3 వేల హెక్టార్ల చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగిన ఈ అడవుల్లో వాళ్లకు అణువణువూ తెలుసు. 

మావోయిస్టు అగ్రనేత మడవి హిడ్మా దళం కర్రె గుట్టలపై ఉందనే పక్కా సమాచారంతో భద్రతా బలగాలు ‘బచావో కర్రె గుట్టలు’ పేరుతో ఆపరేషన్ చేపట్టాయి. హిడ్మా చత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌లోని అబూజ్‌‌‌‌‌‌‌‌మడ్‌‌‌‌‌‌‌‌ నుంచి తప్పించుకొని కర్రె గుట్టలపైకి చేరుకున్నట్టు ఇంటెలిజెన్స్‌‌‌‌‌‌‌‌ వర్గాలు సమాచారం ఇవ్వగా, కర్రె గుట్టలను భద్రతా దళాలు నలువైపులా చుట్టుముట్టి కూంబింగ్‌‌‌‌‌‌‌‌ స్టార్ట్‌‌‌‌‌‌‌‌ చేశాయి. 

నాలుగైదు ఆర్మీ హెలికాప్టర్లు, డ్రోన్లు, జీపీఎస్‌‌‌‌‌‌‌‌ ట్రాకింగ్‌‌‌‌‌‌‌‌ సిస్టం సాయంతో 10 వేల మందికి పైగా పోలీసులు అడవుల్లో అణువణువూ గాలిస్తున్నారు. అయితే ఆరు రోజులుగా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నా, మావోయిస్టుల ఆచూకీ లభించలేదు. మావోయిస్టు అగ్రనేత హిడ్మా సహా అతని దళం ఇక్కడి నుంచి తప్పించుకున్నట్టుగా తెలుస్తున్నది. భద్రతా బలగాల రాకను పసిగట్టి వాళ్లు మకాం మార్చినట్లు సమాచారం. 

భద్రతా బలగాలు తమ స్థావరాల వద్దకు చేరుకునే సమయానికంటే ముందుగానే, హిడ్మా అక్కడి నుంచి తప్పించుకొని పోయి ఉంటారని పోలీస్‌‌‌‌‌‌‌‌ వర్గాలు భావిస్తున్నాయి. అయినప్పటికీ భద్రతా దళాలు మాత్రం వెనక్కి తగ్గట్లేదు. కర్రె గుట్టలపై బేస్‌‌‌‌‌‌‌‌ క్యాంప్‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు చేసి గుట్టలను పూర్తిగా తమ అధీనంలోకి తీసుకునే విధంగా ముందడుగు వేస్తున్నాయి.  

మూడ్రోజులకోసారి షిఫ్ట్‌‌‌‌లు చేంజ్..  

ములుగు జిల్లా వెంకటాపురం కేంద్రంగా చేసుకొని కర్రె గుట్టలపై పోలీస్‌‌‌‌‌‌‌‌ ఆపరేషన్ కొనసాగుతోంది. గత ఆరు రోజులుగా గుట్టలపై కూంబింగ్‌‌‌‌‌‌‌‌ జరుపుతున్న పోలీసులలో కొందరిని కిందికి దింపి, వారి ప్లేస్‌‌‌‌‌‌‌‌లో బ్యాకప్‌‌‌‌‌‌‌‌ పోలీసులను గుట్టలపైకి పంపిస్తున్నారు. గుట్టలపైన ఎండవేడిమి వల్ల జవాన్లు ఢీహైడ్రేషన్‌‌‌‌‌‌‌‌కు గురవుతుండడంతో  ప్రతి మూడు రోజులకోసారి షిఫ్ట్‌‌‌‌లు చేంజ్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నట్టుగా పోలీస్‌‌‌‌‌‌‌‌ వర్గాలు పేర్కొంటున్నాయి. 

చత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌లోని కొత్తపల్లి మొదలుకొని నంబి, ఎలిమిడి, నడిపల్లి, చినఉట్లపల్లి, పెదఉట్లపల్లి, పూజారికాంకేర్, భీమారంపాడు, కస్తూరిపాడు, గుంజపర్తి, గల్గంలో ప్రధానంగా రుద్రారం వరకు 90 కిలోమీటర్ల పొడవున ఉన్న కర్రె గుట్టలను తమ అధీనంలోకి తెచ్చుకునేందుకు వేల సంఖ్యలో పోలీస్‌‌‌‌‌‌‌‌ బలగాలు కొండలపైకి చేరుకుంటున్నాయి. 

ఇప్పటి వరకు ముగ్గురు మహిళా మావోయిస్టుల మృతదేహాలను, ఆయుధాలను, పెద్దఎత్తున పేలుడు సామగ్రిని స్వాధీనం చేసుకున్నామని పోలీసు ఆఫీసర్లు వెల్లడించారు. శనివారం పోలీస్‌‌‌‌‌‌‌‌ ఎన్‌‌‌‌కౌంటర్‌‌‌‌‌‌‌‌లో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు మృతిచెందినట్టుగా ప్రచారం సాగినప్పటికీ ఆఫీసర్లు నిర్ధారించలేదు.