- కేసులు తగ్గుముఖం పట్టినా అప్రమత్తం
- జూన్‌లో మలేరియా మాసోత్సవాలు
- యాక్షన్ ప్లాన్ రెడీ
భద్రాచలం, వెలుగు : భద్రాచలం మన్యంలో మలేరియా తగ్గుముఖం పడుతోంది. హైరిస్కు గ్రామాల సంఖ్యను కూడా జిల్లా మలేరియా శాఖ కుదించింది. గతంలో 249 గ్రామాలు మలేరియా పీడిత ప్రాంతాలుగా ప్రకటించి అక్కడ నియంత్రణ చర్యలు నిర్వహించారు. ఈ సంవత్సరం పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గిన నేపథ్యంలో ఈ గ్రామాల సంఖ్య కూడా 173కు కుదించారు.
2024 సంవత్సరంలో ఈ గ్రామాల్లో చేపట్టాల్సిన మలేరియా కార్యక్రమాలకు బడ్జెట్‌కు ఆ శాఖ ప్రతిపాదనలు పంపించింది. 2022లో 256 మలేరియా పాజిటివ్ కేసులు జిల్లాలో నమోదు కాగా, 2023లో 185 మాత్రమే రికార్డయ్యాయి. మలేరియా నియంత్రణకు యాక్షన్ ప్లాన్ రెడీ చేశారు. జూన్ నెల మొత్తం మలేరియా మాసోత్సవాలు నిర్వహించనున్నారు.
అయినా అలర్ట్..!
మలేరియా వ్యాధి భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో తగ్గుముఖం పట్టినా అప్రమత్తత ప్రకటించారు. జిల్లాకు చుట్టుపక్కల మలేరియా ప్రాభావం ఎక్కువవగా ఉన్న ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలు ఉండటం ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో యాక్షన్ ప్లాన్ రెడీ చేశారు. 2024 ఆర్థిక సంవత్సరంలో ఎంపిక చేసిన జిల్లాలోని 173 గ్రామాల్లో ఆల్ఫా సైపర్ మిత్రిన్ (ఏసీఎం) మందును రెండు విడతలుగా స్ప్రే చేసేందుకు బడ్జెట్ కోసం రాష్ట్ర మలేరియా శాఖ అడిషనల్ డైరెక్టర్ పంపించారు. అక్కడి నుంచి ఈ బడ్జెట్ ప్రతిపాదనలు కేంద్ర మలేరియా శాఖకు వెళ్తాయి.
ఇందుకు రూ.13లక్షలు అవసరం ఉంటుంది. ఇదే కాకుండా జిల్లాలోని 174 హాస్టళ్ల పరిధిలో జూన్ మొదటి వారంలోనే ఒక విడత స్ప్రే చేయాలని యాక్షన్ ప్లాన్ తయారు చేశారు. వేర్వేరు గ్రామాల నుంచి వచ్చే విద్యార్థుల్లో మలేరియా వ్యాధి లక్షణాలు ఉంటే దోమ కాటు వల్ల ఇతరులకు సోకే ప్రమాదం ఉంటుంది. అధికారులు గుర్తించిన 173హైరిస్కు గ్రామాలతో పాటు మరో 195 గ్రామాల్లోనూ మందును పిచికారీ చేసేందుకు అదనంగా రూ.7లక్షలు కావాలని ప్రతిపాదనలు పంపారు.
ప్రైవేటు ఆసుపత్రులు, ప్రైవేటు ల్యాబ్‌లపై కూడా దృష్టి సారించారు. ఇక్కడ నమోదయ్యే జ్వరాల కేసుల వివరాలు మలేరియా శాఖ సేకరిస్తోంది. వీటి లెక్కల ప్రకారం జ్వరపీడిత గ్రామాల్లో దోమల నివారణకు స్ప్రే చేపట్టనున్నారు. గొత్తికోయల గ్రామాలపైనా ప్రధానంగా దృష్టిసారించారు.
దోమతెరల కోసం నిరీక్షణ
గతంలో దోమ కాటు నుంచి ఆదివాసీలను రక్షించేందుకు జిల్లా మలేరియా శాఖ దోమతెరలను పంపిణీ చేసింది. కానీ గత రెండేళ్లుగా వీటిని ఇవ్వడం లేదు. కేంద్ర మలేరియా శాఖకు 70వేల దోమతెరల అవసరం ఉందని లేఖ రాసినా వారు స్పందించడం లేదు. ప్రస్తుతం 2.50లక్షల దోమతెరలు అవసరం ఉంది. ఈసారైనా దోమతెరలు వసత్ఆయా అంటూ ఆదివాసీలు నిరీక్షిస్తున్నారు.
మలేరియా అదుపులో ఉంది
భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో మలేరియా అదుపులో ఉంది. ఎప్పటికప్పుడు హైరిస్కు గ్రామాల్లో నివారణ చర్యలు చేపట్టడం, ర్యాపిడ్ ఫీవర్ సర్వే కార్యక్రమాలతో నియంత్రిస్తున్నాం. పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గినందున ఈసారి మలేరియా పీడిత గ్రామాలను 173కు కుదించాం. అయినప్పటికీ అలసత్వం ప్రదర్శించకుండా నివారణ చర్యలకు బడ్జెట్‌ను రూపొందించాం. 2.50లక్షల దోమతెరల అవసరం ఉంది. తెప్పించేందుకు లేఖలు రాస్తున్నాం.
-
గొంది వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ మలేరియా ఆఫీసర్