మావోయిస్టుల చూపు.. తెలంగాణ వైపు..!

మావోయిస్టుల చూపు.. తెలంగాణ వైపు..!
  • చత్తీస్‌‌గఢ్‌‌లో తీవ్ర నిర్భందం
  • గోదావరి దాటుతున్న మావోలు
  • అనుమానిస్తున్న రాష్ట్ర పోలీసులు
  • భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో హై అలర్ట్‌‌

జయశంకర్‌‌ భూపాలపల్లి, వెలుగు:  మొన్నటి దాకా చత్తీస్‌‌గఢ్‌‌ రాష్ట్రంలో షెల్టర్‌‌ తీసుకున్న మావోయిస్టులు ఇప్పుడు తెలంగాణ వైపు చూస్తున్నట్లు పోలీస్‌‌ ఇంటెలిజెన్స్‌‌ వర్గాలు పేర్కొంటు న్నాయి. కేంద్ర ప్రభుత్వం 2026 నాటికి అంతర్గత టెర్రరిజాన్ని రూపుమాపాలనే లక్ష్యంతో మావోయిస్టుల ఏరివేత కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా ఆపరేషన్‌ కగార్‌‌ పేరుతో అడవులను జల్లెడ పడుతోంది. కొద్ది రోజుల కింద చత్తీస్‌‌గఢ్‌‌లో జరిగిన భారీ ఎన్‌‌కౌంటర్‌లో‌ 36 మంది మావోయిస్టులు చనిపోయారు. దీంతో మావోలు చత్తీస్‌‌గఢ్‌‌ నుంచి తెలంగాణ రాష్ట్రంలోకి చొరబడడానికి ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం మావోయిస్టు కేంద్ర కమిటీలో రాష్ట్రానికి చెందిన వాళ్లే ఎక్కువగా ఉండడం, సరిహద్దు దాటి ఏజెన్సీ పల్లెలకు చేరితే షెల్టర్‌‌ దొరుకుతుందనే భావనతో ఉన్నట్లు  పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో చత్తీస్‌గఢ్‌‌ రాష్ట్ర సరిహద్దులో ఉన్న భూపాలపల్లి, ములుగు జిల్లాల పోలీసులను అప్రమత్తం చేశారు. గోదావరి దాటి రాష్ట్రంలోకి ప్రవేశించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు.

డ్రోన్ల వినియోగం..

మావోయిస్టులను లొంగిపోవాలని ఇటీవల కేంద్ర ప్రభుత్వం కోరింది. అయినా మావోల నుంచి రెస్పాన్స్‌‌ లేకపోవడంతో కగార్‌‌ పేరుతో ఆపరేషన్‌‌ స్టార్ట్‌‌ చేసింది. శాటిలైట్‌ సాయంతో పని చేసే శక్తివంతమైన డ్రోన్లను ఉపయోగిస్తుంది. ముందుగా చత్తీస్‌‌గఢ్‌‌ రాష్ట్రంలోని దట్టమైన అడవుల్లో షెల్టర్‌‌ తీసుకుంటున్న మావోల ఆచూకీ తెలుసుకోవడానికి వీటిని వినియోగించారు. మానవ రహిత డ్రోన్లు గుంపులు, గుంపులుగా ఉన్న మావోల ఆచూకీని పోలీసులకు అందచేసిన వెంటనే వాళ్లు వెళ్లి మావోలపై అటాక్‌‌ చేస్తున్నారు. గతంలో మావోల ఆచూకీ ఈజీగా లభించేది కాదు. దట్టమైన అడవిలో వీరిని వెతికి పట్టుకోవడం పోలీసు‌ బలగాలకు కష్టమయ్యేది.

అడవులను జల్లెడ పడుతున్న పోలీసులు..

మావోయిస్టు కేంద్ర కమిటీలో ఉన్న తెలంగాణకు చెందిన పెద్ద లీడర్లు మావోలను రాష్ట్రంలోకి పంపించి సేఫ్‌‌ జోన్‌‌లో ఉంచడానికి ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. దీంతో మావోలను  రాష్ట్రంలోకి రాకుండా అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తున్నారు. చత్తీస్​గఢ్, మహారాష్ట్ర సరిహద్దుల్లో పోలీసులు రెడ్​ అలర్ట్​ ప్రకటించారు. భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోని అడవులను అడుగడుగునా జల్లెడ పడుతున్నారు. అడవుల్లో కూంబింగ్​ నిర్వహిస్తున్నారు. గోదావరి పరివాహక ప్రాంతంపై పోలీసు నిఘా పెట్టారు. చత్తీస్‌‌గఢ్‌‌ నుంచి వచ్చి ఇక్కడ జీవిస్తున్న గొత్తి కోయగూడేల్లో కార్డన్  సెర్చ్  నిర్వహిస్తున్నారు.

యువతపై ఫోకస్‌..‌

చత్తీస్‌‌గఢ్‌‌ నుంచి మావోలు తెలంగాణలోకి ప్రవేశిస్తున్నారనే సమాచారం పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోని పోలీస్‌‌ స్టేషన్ల పరిధిలో ఇన్ ఫార్మర్  వ్యవస్థను అలర్ట్​ చేశారు. సరిహద్దు పోలీస్​స్టేషన్లకు భారీ భద్రత కల్పించారు. పోలీస్‌‌  ఆఫీసర్లు అటవీ గ్రామాల్లో పల్లె నిద్రలు చేసి ప్రజలను చైతన్యం చేస్తున్నారు. మావోయిస్టులకు షెల్టర్‌‌ ఇవ్వకుండా యువతపై ఫోకస్‌‌ పెట్టారు. మావోయిస్టులు ప్రతీకార చర్యలకు పాల్పడే అవకాశం ఉన్నట్లు ఇంటలిజెన్స్  వర్గాలు హెచ్చరించడంతో పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోని వివిధ పార్టీల లీడర్లు, సివిల్  కాంట్రాక్టర్లు, మావోయిస్టులు టార్గెట్  చేసిన వ్యక్తులను అలర్ట్​ చేశారు.