
- హెచ్‌ఐసీసీ, సైబరాబాద్ పరిసర ప్రాంతాల్లో పటిష్టమైన నిఘా
- కౌంటర్ ఇంటెలిజెన్స్ సహా అన్ని విభాగాలు అప్రమత్తం
- ఏప్రిల్ 25,26 తేదీల్లో భారత్ సమిట్, మే 7 నుంచి మిస్ వరల్డ్-2025
హైదరాబాద్, వెలుగు: దేశ వ్యాప్తంగా మరిన్ని ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందన్న కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికలతో రాష్ట్ర పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ నెల 25, 26 వ తేదీల్లో హెచ్‌ఐసీసీ కేంద్రంగా జరగనున్న భారత్ సమిట్–2025, మే 7 నుంచి 31 వరకు జరగనున్న మిస్ వరల్డ్–2025 సహా పలు జాతీయ స్థాయి కార్యక్రమాల నేపథ్యంలో భద్రతను మరింత పటిష్టం చేయనున్నారు.
హైదరాబాద్ సహా దేశంలో ఉగ్రవాద ప్రభావిత రాష్ట్రాలు మరింత అప్రమత్తంగా ఉండాలన్న హెచ్చరికల నేపథ్యంలో సీఎస్ శాంతికుమారి రాష్ట్ర పోలీస్ యంత్రాంగాన్ని అలర్ట్ చేశారు. ఈ మేరకు డీజీపీ జితేందర్ బుధవారం రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారులకు పలు అంశాలపై సూచనలు చేసినట్లు తెలిసింది. జాతీయ, అంతర్జాతీయ రాజకీయ, ఆర్థిక పరమైన అంశాలపై భారత్ సమిట్‌లో చర్చ జరగనుంది. ఈ సమిట్‌లో రాహుల్‌గాంధీ సహా వంద దేశాల నుంచి దాదాపు 400 మంది హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు మిస్ వలర్డ్ పోటీలకు 140 దేశాల నుంచి కంటెస్టెంట్స్ హాజరవుతున్నారు.
ఇవన్నీ అత్యంత ప్రతిష్టాత్మక కార్యక్రమాలు కావడంతో పోలీస్ యంత్రాంగం సవాల్‌గా తీసుకుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ముందస్తు కార్యాచరణ రూపొందిస్తున్నారు. హైదరాబాద్‌లో ఇప్పటికే టెర్రరిస్టుల దాడులకు గురైన ప్రాంతాలు సహా పర్యాటక ప్రాంతాల్లో భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేశారు. కౌంటర్ ఇంటెలిజెన్స్ ద్వారా వివరాలు సేకరిస్తున్నారు. అనుమానితులు, సమస్యాత్మక ప్రాంతాల్లో పటిష్టమైన నిఘా పెట్టినట్టు సమాచారం.
భారత్ సమిట్ జరిగే సైబరాబాద్ కమిషనరేట్ పరిసర ప్రాంతాలను గురువారం రాత్రి నుంచే తమ ఆధీనంలోకి తీసుకోనున్నారు. హైటెక్ సిటీ సహా విదేశీయులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో స్థానిక పోలీసులు తనిఖీలు నిర్వహించే విధంగా చర్యలు చేపట్టారు. పాతబస్తీ సహా అనుమానిత ప్రాంతాల్లో పాత నేరస్తులపై ప్రత్యేక నిఘా పెట్టారు.