
కశ్మీర్ పహల్గాం ఉగ్రదాడి జరిగిన క్రమంలో తిరుమలలో ముందస్తు జాగ్రత్త చర్యలు మొదలుపెట్టారు. అందులో భాగంగా భద్రతా దళాలు మాక్ డ్రిల్ నిర్వహించాయి. తిరుమలలో అనూహ్యంగా ఉగ్రవాదులు చొరబడితే ఎలా ఎదుర్కోవాలి, భక్తులను ఎలా రక్షించాలో మెళకువలు నేర్పించారు. దీనికి సంబంధించి లేపాక్షి సర్కిల్ వద్ద ఉన్న సుదర్శన్ సత్రంలో గురువారం (ఏప్రిల్ 24) సాయంత్రం భద్రతా దళాల మాక్ డ్రిల్ చేసి చూపారు.
ఉగ్రదాడి జరిగినప్పుడు ఎలా వ్యవహరించాలనే అంశంపై అదనపు ఏస్పీ శ్రీ రామకృష్ణ ఆధ్వర్యంలో టీటీడీ నిఘా, భద్రతా, సివిల్ పోలీసులకు, రిజర్వు పోలీసులకు, ఆలయ సిబ్బందికి, వైద్య సిబ్బందికి క్షుణ్ణంగా వివరించారు.
అసాల్ట్ డాగ్ ఎనిమీ ఎటాక్, రూమ్ ఇన్టర్వెన్షన్ కార్యకలాపాలు చేసి చూపారు. దాదాపు ఒకటిన్నర గంటలపాటు ఈ మాక్ డ్రిల్ కొనసాగింది. ఈ మాక్ డ్రిల్ లో 28 మంది ఆక్టోపస్ కమాండోలు, 25 మంది టీటీడీ విజిలెన్స్ సిబ్బంది, 15 మంది పోలీసులు, 10 ఏపీఎస్పీ సిబ్బంది భాగమయ్యారు. ఈ కార్యక్రమంలో వీజీవోలు శ్రీ రామ్ కుమార్, శ్రీ సురేంద్ర, డీఎస్పీ శ్రీ విజయ శేఖర్, ఏవిఎస్ఓలు, పోలీసు, ఆక్టోపస్, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.