నేటి కాలంలో హైబీపీ చాలా సాధారణ సమస్యగా మారింది పొద్దున్న లేచింది మొదలు.. రాత్రి పడుకునేంత వరకు జనాలు టెన్షన్ లైఫ్ గడుపుతున్నారు. ఇంట్లో బిజీ.. ఆఫీసులో బిజీ.. ఒక్కోసారి తిండి కూడా తినకుండా తెగ టెన్షన్ పడుతూ పనులు చేస్తుంటారు. ఈ టెన్షన్ హైబీపీకి దారితీస్తుంది. అలాంటి వారికి గుండె జబ్బులు కూడా వచ్చే అవకాశం ఉంది. అందుకే ఒక్కసారి దీని బారిన పడ్డవారు అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఆహార నియమాలు కచ్చితంగా పాటించాలి.
సోడియం ఉండే ఆహార పదార్థాల్ని చాలా తక్కువగా తినాలి. పొటాషియం ఉండే పదార్థాలు తింటే మంచిది.బరువును అదుపులో ఉంచుకోవాలి. ప్రతి రోజూ జాగింగ్ లేదా వ్యాయామం చేయడం అలవాటుచేసుకోవాలి. ప్రాసెస్డ్ ఫుడ్, ఆల్కహాల్లకు దూరంగా ఉండాలి. నకిలీ, తక్కువ నాణ్యత కలిగిన నూనెలు వాడకూడదు. ఉప్పు తక్కువగా తీసుకోవాలి. అన్నింటికీ మించి కూరగాయలు, పండ్లు అధికంగా తినాలి.
ALSO READ : Good Health : పరకడుపున టీ, కాఫీలు అస్సలు తాగొద్దు.. అలా తాగితే ఏమవుతుందో తెలుసా..!
హైబీపీ పేషెంట్లకు ఎక్కువగా మేలు చేసేది మాత్రం బీట్ రూటే. బీట్ రూట్ తో మేలు బీట్ రూట్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రక్తపోటును నియంత్రించడంతోపాటు, చెడు కొవ్వును తగ్గిస్తాయి. ఇందులోని విటమిన్ బి, రక్తనాళాలు సక్రమంగా పని చేసేలా చేస్తుంది. తక్కువ క్యాలరీలు కలిగిన బీట్ రూట్ ఎక్కువ శక్తినిస్తుంది.బీట్ రూట్ లో ఉండే నైట్రేట్లు, నైట్రిక్ ఆక్సైడ్ ను ఉత్పత్తి చేస్తాయి. రక్తనాళాల్లో రక్త సరఫరా సక్రమంగా జరిగేందుకు ఈ వాయువు తోడ్పడుతుంది. బీట్ రూట్ ను జ్యూస్ చేసుకుని తాగితేనే మంచి ఫలితం ఉంటుంది. రక్తపోటు ఉన్నవారు రోజూ 200 మిల్లీ లీటర్ల జ్యూస్ తాగాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.