- బీఆర్ఎస్లో ముదురుతున్న అవిశ్వాసం లొల్లి
- ఇల్లందు మున్సిపల్ వ్యవహారంపై హైకమాండ్ ఫోకస్
- కోర్టు కెళ్లేందుకు సిద్ధమవుతున్న అసమ్మతి కౌన్సిలర్లు
- ప్రలోభాలపై పొలీసులకు చైర్మన్ వర్గీయుల ఫిర్యాదు
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: బీఆర్ఎస్లో ఇల్లందు మున్సిపల్ అవిశ్వాసం తీర్మానం చిచ్చురేపుతోంది. మున్సిపల్ చైర్మన్ డి వెంకటేశ్వరరావుపై అవిశ్వాసం పెట్టేందుకు సిద్ధమైన అసమ్మతి కౌన్సిలర్లు క్యాంప్ రాజకీయాలకు శ్రీకారం చుట్టారు. ఈ వ్యవహారంపై మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ఫోకస్ పెట్టారు. అవిశ్వాస తీర్మానం కాపీలను కలెక్టర్ తీసుకోకపోవడంతో కోర్టుకు వెళ్లేందుకు అసమ్మతి కౌన్సిలర్లు సిద్ధమవుతున్నారు. మరోవైపు కలెక్టర్ అనుదీప్ తీరుపై సీఎస్‌కు కంప్లైంట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. మరోవైపు అవిశ్వాస తీర్మానంపై సంతకం పెడితే తమకు రూ.10 లక్షల చొప్పున ఇస్తామని ప్రలోభ పెట్టారంటూ చైర్మన్ వర్గీయులు పొలీసులకు కంప్లైంట్ ఇవ్వడంతో బీఆర్ఎస్లో రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది.
క్యాంప్ నకు అసమ్మతి కౌన్సిలర్లు..
ఇల్లందు మున్సిపాలిటీ బీఆర్ఎస్ కౌన్సిలర్లలో నెలకొన్న విభేదాలు అధిష్టానానికి తలనొప్పిగా మారాయి. నిన్నటి వరకు ఎమ్మెల్యే భానోత్ హరిప్రియతో ఉన్న పలువురు కౌన్సిలర్లు ఇప్పుడు చైర్మన్ డి వెంకటేశ్వరరావుపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు సిద్ధమయ్యారు. అసమ్మతి కౌన్సిలర్లకు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వర్గం తెర వెనుక మద్ధతు ప్రకటించినట్లు ప్రచారం జరుగుతోంది. మున్సిపాలిటీలో 24 వార్డులకు గాను బీఆర్ఎస్కు19 మంది కౌన్సిలర్లున్నారు. చైర్మన్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ దాదాపు15 మంది కౌన్సిలర్లు సంతకం పెట్టిన అవిశ్వాసం తీర్మానం కాపీని కలెక్టర్ అనుదీప్‌కు ఇచ్చేందుకు సోమవారం కలెక్టరేట్‌కు వెళ్లగా ఆయన తీసుకోలేదు. దీంతో వారు ఇన్‌వార్డులో ఇచ్చారు. అవిశ్వాసం తీర్మానం కాపీని కలెక్టర్ తీసుకోకపోవడంపై నిరసన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపైకోర్టుకు వెళ్లేందుకు లీగల్ అడ్వయిజర్ సలహాలు తీసుకుంటున్నారు. ఇక అసమ్మతి కౌన్సిలర్లకు చెక్ పెట్టేలా చైర్మన్వర్గం పావులు కదుపుతోంది.
అవిశ్వాస తీర్మానం కాపీపై సంతకం పెడితే రూ.10 లక్షలు ఇస్తామని పలువురు కౌన్సిలర్ల ఇండ్ల వద్దకు డబ్బులు పట్టుకొని వెళ్లారనే ప్రచారం ఉంది. చైర్మన్‌కు వ్యతిరేకంగా సంతకం పెడితే డబ్బులు ఇస్తామని ప్రలోభ పెట్టారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఇద్దరు కౌన్సిలర్లు సోమవారం రాత్రి ఇల్లందు పొలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. మంగళవారం కలెక్టరేట్లోని ఇన్‌వార్డులో కంప్లైంట్ చేశారు. అసమ్మతి కౌన్సిలర్లతో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు రాజమండ్రి, వైజాగ్ టూర్‌కు వెళ్లారు. ఇదిలాఉంటే మంగళవారం సాయంత్రం ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో ఎమ్మెల్సీ తాతా మధు మిగిలిన కౌన్సిలర్లతో సమవేశమై అవిశ్వాసంపై చర్చించారు.
ముఖ్య నేతల నజర్..
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొదటిసారి ఇల్లందు మున్సిపాలిటీలో చైర్మన్‌పై అవిశ్వాసం పెట్టేందుకు బీఆర్ఎస్ కౌన్సిలర్లు సిద్ధం కావడంతో ముఖ్య నేతలు ఈ వ్యవహారంపై ఫోకస్ పెట్టారు. అవిశ్వాసం పెడుతున్న కౌన్సిలర్లలో ఎక్కువ మంది ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ అనుచరులే ఉన్నారు. అవిశ్వాసం విషయంలో హైకమాండ్ సీరియస్ కావడంతో అసమ్మతి కౌన్సిలర్లు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో జత కట్టారు. దీంతో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్యే హరిప్రియ, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ అప్రమత్తమయ్యారు. ఏం జరుగుతుందనే విషయంపై ఆరా తీసే పనిలో పడ్డారు.