జైపూర్: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆ రాష్ట్ర సీఎం అశోక్ గెహ్లాట్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన రాజకీయ భవిష్యత్తును కాంగ్రెస్ అధిష్టానమే నిర్ణయిస్తుందని తెలిపారు. ఎన్నికల అనంతరం హైకమాండ్ అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వహిస్తానని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులతో ప్రజలు సంతోషంగా ఉన్నారని ఆయన వెల్లడించారు. రాజస్థాన్ లో కాంగ్రెస్ పూర్తి మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రతి ఐదేండ్లకు ఒక్కసారి అధికారం మారే సంప్రదాయం ఈ సారి బ్రేక్ అవుతుందన్నారు.
కరోనా అనంతరం తమ ప్రభుత్వం మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టిందన్నారు. అందుకే రాజస్థాన్లో మళ్లీ కాంగ్రెస్ సర్కారే వస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తుందని గెహ్లాట్ ఆరోపించారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ప్రభుత్వాలను గద్దె దించడానికి బీజేపీ ప్రయత్నించిందని మండిపడ్డారు. రాజస్థాన్ అసెంబ్లీలో 200 సీట్లు ఉండగా.. 199 సీట్లకు నవంబర్ 25న ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి గుర్మీత్ సింగ్ మరణించడంతో కరణ్ పూర్ నియోజకవర్గ ఎలక్షన్ వాయిదా పడింది. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది.