- మొన్న బండికి.. నిన్న పొన్నంకు పార్టీ హైకమాండ్ షాక్
- అధికార పార్టీపై పోరాడే వీరికి ప్రాధాన్యం తగ్గడంపై రాజకీయ వర్గాల్లో చర్చ
- ఎన్నికల ఏడాదిలో ఊహించని ట్విస్టులు
- తీవ్ర ఆగ్రహం, ఆవేదనతో నేతల అనుచరులు
- కాంగ్రెస్ ఓబీసీ సమావేశానికి పొన్నం దూరం
కరీంనగర్, వెలుగు: రాష్ట్ర రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన కరీంనగర్ లీడర్లకు ఎన్నికల ఏడాది కలిసి రావట్లేదు. మొన్నటి వరకు తమ తమ పార్టీలో చక్రం తిప్పిన లీడర్లు.. ఇప్పుడు గడ్డు కాలం ఎదుర్కొంటున్నారు. నెల రోజుల వ్యవధిలో రాష్ట్ర రాజకీయాల్లో వరుస పరిణామాలు జిల్లా రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఈ నెల మొదటి వారంలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌ను బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించగా, నాలుగు రోజుల క్రితం కాంగ్రెస్ ప్రకటించిన రాష్ట్ర ఎన్నికల కమిటీలో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్చోటుదక్కలేదు. ఈ పరిణామాలతో ఇద్దరు నేతల భవిష్యత్ ఇరకాటంలో పడేయగా.. వారి అనుచరులు ఈ పరిణామాలను జీర్ణించుకోలేకపోతున్నారు. రాష్ట్ర పార్టీలో తమ నేతలకు ప్రాధాన్యం తగ్గడంతో వారిని నమ్ముకున్న నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహానికి, ఆవేదనకు లోనవుతున్నారు. అధికార పార్టీపై పోరులో ఫైటర్లుగా పేరున్న నేతలకు సడెన్‌గా ప్రాధాన్యం తగ్గించడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
కష్టకాలంలో పార్టీని నడిపించినోళ్లకు కష్టాలు..
కష్టకాలంలో పార్టీని నడిపించినోళ్లకు కష్టాలు వచ్చాయని ఉమ్మడి జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇన్నాళ్లు బీజేపీ అన్నీ తానై ఉన్న బండికి సడెన్‌గా పదవి పోవడం.. అనుచరులు తట్టుకోలేకపోతున్నారు. హైకమాండ్‌పై కేడర్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 2005లో కార్పొరేటర్‌గా ఎన్నికై ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగుపెట్టిన బండి సంజయ్.. తన రాజకీయ జీవితంలో అనేక ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి.. తన ప్రత్యర్థి గంగుల కమలాకర్ కు గట్టి పోటీనిచ్చారు. 2019లో కరీంనగర్ ఎంపీగా గెలిచాక ఏడాది తిరగకముందే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. బండి సంజయ్ బాధ్యతలు చేపట్టాక పార్టీలో తనదైన ముద్ర వేశారు. సంజయ్ సారథ్యంలోనే దుబ్బాక, హుజురాబాద్ ఉపఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. జీహెచ్ ఎంసీలోనూ 44 మంది బీజేపీ అభ్యర్థులు కార్పొరేటర్లుగా గెలిచారు.
వరుస విజయాలు, ప్రజాసంగ్రామ యాత్రతో అధికార బీఆర్‌ఎస్‌కు తెలంగాణలో ప్రత్యామ్నాయం బీజేపీయేనన్న అభిప్రాయాన్ని ప్రజల్లో కల్పించడంలో సంజయ్ సక్సెస్ అయ్యారు. ఆయన పలుమార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా.. అవి ఓ వర్గం ఓట్లను రాబట్టేందుకు ఉపకరించాయి. రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటం చేసే క్రమంలో పలుమార్లు అరెస్టవ్వడమేగాక జైలుకు కూడా వెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటం చేసే క్రమంలో ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాతో శెభాష్ అనిపించుకున్న ఆయనే.. తీరా ఎన్నికల ముందు పదవిని కోల్పోవడం ఎవరూ ఊహించలేదు. ఈ ఊహించని ట్విస్ట్ ఆ పార్టీ శ్రేణులను షాక్ కు గురి చేసింది. కేంద్రంలో ఏదైనా మినిస్ట్రీ వస్తుందనే ప్రచారం.. పార్టీ క్యాడర్ కు కొంత ఓదార్పునిస్తున్నా రాష్ట్ర అధ్యక్ష పదవిని కోల్పోవడం మాత్రం వారు జీర్ణించుకోలేకపోతున్నారు. \
ALSO READ :పిల్లల ఎదుగుదలకు పల్లెలే బెటర్
పొన్నంకు ఎన్నికల కమిటీలో దక్కని చోటు
ఏఐసీసీ ఇటీవల ప్రకటించిన తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల కమిటీలో ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ కు చోటుదక్కలేదు. ఉద్యమకాలంలో కాంగ్రెస్ ఎంపీగా పార్లమెంట్‌లో బలమైన గొంతు వినిపించడమేగాక పార్టీ హైకమాండ్‌ను తెలంగాణ ఇచ్చేలా ఒప్పించడంలో ముందున్న ఆయనకు ఇప్పుడు ప్రాధాన్యం తగ్గించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆయన ఎంపీగా పోటీ చేసి రెండు సార్లు ఓడిపోయినప్పటికీ.. కరీంనగర్ లోక్‌సభ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులకు పెద్దదిక్కుగా ఉన్నారు. అంతేగాక రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ అనేకసార్లు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు.
గత ఎన్నికల కమిటీలో సభ్యుడిగా ఉన్న ఆయనకు ఈసారి చోటు కల్పించకపోవడంతో జిల్లా పార్టీ శ్రేణులు భగ్గుమన్నాయి. డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, రాజన్న సిరిసిల్ల డీసీసీ అధ్యక్షుడు ఆది శ్రీనివాస్, హుస్నాబాద్, చొప్పదండి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జులు అలిగిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి, మేడిపల్లి సత్యం, మేనేని రోహిత్ రావు సహా సుమారు 700 మంది ఆదివారం గాంధీ భవన్ కు వెళ్లి తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జి మానిక్ రావు ఠాక్రే కు, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కలిశారు. మరో 48 గంటల్లో మీరు ఊహించిన దానికంటే పెద్ద పదవి పొన్నంకు దక్కుతుందని చెప్పి పంపారు. వారు చెప్పిన గడువు బట్టి మంగళవారంతో ముగిసింది. కానీ పొన్నం పదవిపై మాత్రం క్లారిటీ రాలేదు.
హైకమాండ్ తీరుపై పొన్నం అలక
కాంగ్రెస్ ఎన్నికల కమిటీలో తనకు చోటుదక్కకపోవడంతో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అలకబూనారు. కమిటీ ప్రకటించినప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. కాంగ్రెస్ లో బలమైన బీసీ నేతగా పేరున్న ఆయన.. తన జిల్లాలో నిర్వహించిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఓబీసీ సమావేశానికి సైతం హాజరు కాలేదు. పొన్నం గైర్హాజర్ అంశం పార్టీలో చర్చనీయాంశంగా మారింది.