మునుగోడు కొత్త ఓటర్ల జాబితా ప్రకటనపై విచారణ వాయిదా

మునుగోడు నియోజకవర్గ కొత్త ఓటర్ల జాబితా ప్రకటనకు సంబంధించి దాఖలైన పిటిషన్పై విచారణను హైకోర్టు  వాయిదా వేసింది. బీజేపీ దాఖలు చేసిన రిట్ పిటిషన్ను ధర్మాసనం పరిశీలించింది. కొత్త ఓటర్ల జాబితా నివేదికను కోర్టుకు సమర్పించాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ ధర్మాసనం రేపటికి వాయిదా వేసింది. 

మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ ఓటర్ లిస్టులో అక్రమాలకు పాల్పడుతోందని బీజేపీ ఆరోపిస్తోంది. రెండు నెలల్లో కొత్తగా 25వేల మంది ఓటు కోసం దరఖాస్తు చేసుకోవడంపై అనుమానం వ్యక్తం చేసింది. ఈ విషయంపై విచారణ జరపాలని కోరుతూ మంగళవారం హైకోర్టును ఆశ్రయించింది. అంతకుముందు 7 నెలల్లో కేవలం 1,474 మంది మాత్రమే ఓటు కోసం అప్లై చేసుకోగా.. ఈ మధ్యకాలంలో 24,781 దరఖాస్తు  చేసుకోవడం వెనుక టీఆర్ఎస్ హస్తం ఉందని పిటిషన్ లో పేర్కొంది. ఈ నేపథ్యంలో జులై 31నాటికి ఉన్న ఓటర్ లిస్టు ఆధారంగానే మునుగోడు ఉప ఎన్నిక నిర్వహించేలా ఎన్నికల కమిషన్ కు ఆదేశించాలని కోరింది. ఈ నెల 14న ఎలక్షన్ కమిషన్ కొత్త ఓటర్ లిస్ట్ ప్రకటించనున్నందున కోర్టు నిర్ణయం వెలువడే వరకు జాబితా విడుదల చేయకుండా ఆదేశాలు జారీ చేయాలని అభ్యర్థించారు. పిటిషన్ను పరిశీలించిన ధర్మాసనం గురువారం విచారణ జరుపుతామని చెప్పింది. ఇవాళ పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది.