సింగరేణి ఎన్నికలు : మరోసారి వాయిదా వేసిన హైకోర్టు

హైదరాబాద్: ఈ నెల 28న జరగాల్సిన సింగరేణి ఎన్నికలు వాయిదా వేస్తున్నట్టు తెలంగాణ హైకోర్టు ప్రకటించింది. ఎన్నికలు వాయిదా వేయాలని కోరుతూ సింగరేణి యాజమాన్యం దాఖలు చేసిన పిటిషన్ పై ఇవాళ విచారణ చేపట్టిన హైకోర్టు ఈ  ఎన్నికలను డిసెంబర్  27న నిర్వహించాలని సూచించింది. సింగరేణి విస్తరించి ఉన్న జిల్లాల్లో కొన్ని ప్రాంతాలు మావోయిస్టు ప్రాబల్యం ఉన్నవని హైకోర్టుకు తెలిపింది. ఇప్పటికే తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయడంతో ఆయా జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులు ఆ ఏర్పాట్లలో బిజీగా ఉన్నారని హైకోర్టు దృష్టికి తీసుకొని వెళ్లింది.

ALSO READ: చైతన్యపురి జంక్షన్లో రోడ్డుపై భారీ గుంత

 ఇలాంటి పరిస్థితుల్లో పోలీసు శాఖ కూడా తగినంత భద్రత కల్పించలేదని తెలిపింది. యాజమాన్యం తరపు వాదనలు విన్న డివిజన్ బెంచ్ ఎన్నికలు నెల రోజుల పాటు వాయిదా వేసింది. ఈ మేరకు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును రద్దు చేసింది. డిసెంబర్ 27న సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని.. నవంబర్ 30లోగా ఓటరు జాబితాను సిద్ధం చేయాలని కార్మిక శాఖను ఆదేశించింది. హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు నేపథ్యంలో ఇప్పటికే కార్మిక శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ రద్దు కానున్నది.