ఫాంహౌస్ కేసుకు సంబంధించి బీజేపీ పిటిషన్ పై విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. కేసుకు సంబంధించి న్యాయస్థానం 8మంది ప్రతివాదులకు నోటీసులు జారీ చేయగా ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. మిగిలిన ప్రతివాదులు రిప్లైకి గడువు కోరడంతో న్యాయమూర్తి విచారణను సోమవారానికి వాయిదా వేశారు. మరోవైపు ప్రభుత్వం కోర్టుకు సమర్పించిన వీడియో క్లిప్పింగులను అనుమతించాలని హైకోర్టు రిజిస్ట్రీకి ఆదేశించారు.
ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నం చేశారంటూ తమ పార్టీ ప్రతిష్ఠను దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారంటూ బీజేపీ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. మునుగోడు ఉప ఎన్నికల నేపధ్యంలో తమ పార్టీకి వస్తున్న ఆదరణ చూడలేక టీఆర్ఎస్ కుట్ర చేసిందని పిటిషన్లో పేర్కొంది. ఫాంహౌజ్ కేసును సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జికి అప్పగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరింది. శనివారం ఈ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం 8 మంది ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. మునుగోడు ఉప ఎన్నిక ముగిసే వరకు ఫాం హౌస్ కేసులో పోలీసు దర్యాప్తుపై స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను ఇవాళ్టికి వాయిదా వేసింది. తాజాగా ఈ రోజు విచారణ జరిపిన హైకోర్టు ప్రతివాదుల అభ్యర్థన మేరకు కేసును సోమవారానికి వాయిదా వేసింది.