తెలంగాణలో 50 కాలేజీలు దోస్త్ ఆన్ లైన్ ప్రవేశాలతో సంబంధం లేకుండా డిగ్రీ ప్రవేశాలు చేపట్టనున్నాయి. ఈ మేరకు హైకోర్టు అనుమతినిచ్చింది. 2023-24లోనూ దోస్త్‌తో సంబంధం లేకుండా ప్రవేశాలను అనుమతించాలని 50 కాలేజీల యాజమాన్యాలు హైకోర్టులో పిటిషన్లు వేశాయి. కాలేజీల యాజమాన్యాల పిటిషన్లను స్వీకరించిన హైకోర్టు...ఆయా కళాశాలల్లో డిగ్రీ ప్రవేశాల్లో జోక్యం చేసుకోవద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై విచారణను జూన్ 15కి వాయిదా వేసింది హైకోర్టు.
రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో బీకాం, బీఏ, బీఎస్సీ వంటి డిగ్రీ కోర్సులకు 2016 -17 నుంచి తెలంగాణ ప్రభుత్వం ఆన్లైన్ ప్రవేశాలు చేపడుతోంది. అయితే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అనేక కాలేజీల యాజమాన్యాలు 2016-17లోనే హైకోర్టును ఆశ్రయించాయి. తమ అభిప్రాయాలు తెలుసుకోకుండానే ప్రవేశాలు, ఫీజులను నియంత్రించడం కరెక్ట్ కాదని వాదించాయి. ఈ వాదనలు విన్న హైకోర్టు గతంలో మాదిరిగానే ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు..డిగ్రీలో ప్రవేశాలు జరపొచ్చునంటూ 2017లోనే మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఆ పిటిషన్ ఇప్పటికీ హైకోర్టులోనే పెండింగ్ లో ఉంది. ఆ తర్వాత ప్రతీ ఏడాది కూడా ఉన్నత విద్యా మండలి దోస్త్ నోటిఫికేషన్ ఇస్తూనే ఉంది. అయితే ఈ నోటిఫికేషన్ పై 50కి పైగా కళాశాలలు హైకోర్టును ఆశ్రయిస్తూనే ఉన్నాయి. మధ్యంతర ఉత్తర్వులతో ప్రవేశాలు జరుపుతూనే ఉన్నాయి.
ఈ ఏడాది కూడా డిగ్రీలో ప్రవేశాల కోసం దోస్ట్ నోటిఫికేషన్ విడుదల అయింది. దీంతో మరోసారి 50కి పైగా కాలేజీలు హైకోర్టును ఆశ్రయించాయి. దోస్త్ నోటిఫికేషన్ పై తమ అభ్యంతరాలు అలాగే ఉన్నాయని....దీనిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని కాలేజీల యాజమాన్యాలు హైకోర్టుకు తెలియజేశాయి. ప్రతీ ఏడాదది పిటిషన్లు వేసి మధ్యంతర ఉత్తర్వులతో ప్రవేశాలు చేస్తున్నామని....కేసులు పెండింగులోనే ఉన్నాయని కాలేజీ యాజమాన్యాలు విన్నవించాయి. ఈ వాదనలు విన్న హైకోర్టు పిటిషన్లు వేసిన కాలేజీల్లో గతంలో మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ప్రవేశాలు చేసుకోవచ్చని సూచించింది. ఈ వ్యవహారంలో ప్రభుత్వం, ఉన్నత విద్యా మండలి జోక్యం చేసుకోవద్దని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈ అంశంపై కౌంటర్లు వేయాలని ప్రభుత్వానికి, ఉన్నత విద్యా మండలికి, యూనివర్సిటీలను హైకోర్టు ఆదేశించింది.