సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో ఎంక్వైరీ కొనసాగించవచ్చు : హైకోర్టు

సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో ఎంక్వైరీ కొనసాగించవచ్చు : హైకోర్టు
  • అల్లు అర్జున్, సంధ్య థియేటర్‌‌‌‌‌‌‌‌ యాజమాన్యం పోలీసులకు సహకరించాలి: హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: పుష్ప2  బెనిఫిట్​ షో సందర్భంగా సంధ్య థియేటర్‌‌‌‌‌‌‌‌లో తొక్కిసలాట జరిగి ఓ మహిళ మరణించిన కేసులో పోలీసులు ద్యర్యాప్తు కొనసాగించవచ్చని హైకోర్టు తెలిపింది. నటుడు అల్లు అర్జున్, సంధ్య థియేటర్‌‌‌‌‌‌‌‌ యజమానులు దర్యాప్తునకు సహకరించాలని.. దర్యాప్తులో జోక్యం చేసుకోరాదని ఆదేశించింది. ఈ కేసులో హీరో అల్లు అర్జున్‌‌‌‌‌‌‌‌తోపాటు సంధ్య థియేటర్‌‌‌‌‌‌‌‌ యజమానులు ఇద్దరికి నాలుగు వారాల(జనవరి 10 వతేదీ) మధ్యంతర బెయిలు మంజూరు చేసింది. రూ.50 వేల వ్యక్తిగత బాండ్‌‌‌‌‌‌‌‌ను అందజేయాలని ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ మధ్యంతర ఉత్తర్వులు పోలీసుల దర్యాప్తునకు అవరోధం కాదని చెప్పింది. క్వాష్‌‌‌‌‌‌‌‌ పిటిషన్‌‌‌‌‌‌‌‌లో కౌంటరు దాఖలు చేయాలని పోలీసులను ఆదేశిస్తూ విచారణ వాయిదా వేశారు. అల్లు అర్జున్‌‌‌‌‌‌‌‌ రిమాండ్‌‌‌‌‌‌‌‌ను తిరస్కరించాలని.. భోజన విరామ సమయంలో విచారణ చేపట్టాలంటూ ఆయన తరఫు న్యాయవాదులు జస్టిస్‌‌‌‌‌‌‌‌ జువ్వాడి శ్రీదేవి ధర్మాసనం ముందు అభ్యర్థించారు. అల్లు అర్జున్‌‌‌‌‌‌‌‌ తరఫున ఎస్‌‌‌‌‌‌‌‌.నిరంజన్‌‌‌‌‌‌‌‌రెడ్డి వాదనలు వినిపిస్తూ లంచ్‌‌‌‌‌‌‌‌ మోషన్‌‌‌‌‌‌‌‌ పిటిషన్‌‌‌‌‌‌‌‌కు అనుమతించాలని కోరగా న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ సెలబ్రిటీ అని ఇప్పుడు అనుమతిస్తే రేపు సామాన్యులకు కూడా ఇలానే అనుమతించాలి కదా ప్రశ్నించారు.

దీనిపై న్యాయవాది స్పందిస్తూ సామాన్యుడిగానే తమ పిటిషనర్‌‌‌‌‌‌‌‌ను పరిగణించాలన్నారు. న్యాయమూర్తి విచారణను మధ్యాహ్నానికి వాయిదా వేశారు.మధ్యాహ్నం పీపీ పల్లె నాగేశ్వరరావు వాదనలు వినిపిస్తూ అల్లు అర్జున్‌‌‌‌‌‌‌‌ను అరెస్ట్‌‌‌‌‌‌‌‌ చేసి రిమాండ్‌‌‌‌‌‌‌‌కు పంపారని, ప్రస్తుతం ఈ పిటిషన్‌‌‌‌‌‌‌‌పై విచారణ వృథా అన్నారు. లంచ్‌‌‌‌‌‌‌‌ మోషన్‌‌‌‌‌‌‌‌కు అనుమతించరాదన్నారు. పిటిషనర్‌‌‌‌‌‌‌‌ను ప్రత్యేకంగా చూడాల్సిన అవసరంలేదన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. పీపీ అందుబాటులో ఉన్నందున లంచ్‌‌‌‌‌‌‌‌మోషన్‌‌‌‌‌‌‌‌కు అనుమతిస్తూ విచారణను సాయంత్రానికి వాయిదా వేశారు.

పోలీసులకు సమాచారం ఇచ్చారు

హత్య జరుగుతుందని తెలిసీ ఉద్దేశపూర్వకంగా వ్యవహరించారని అల్లు అర్జున్​పై కేసు నమోదు చేశారని, ఇక్కడ అలాంటి పరిస్థితి లేదని నిరంజన్​రెడ్డి అన్నారు. సినిమా విడుదల సందర్భంగా నటులు థియేటర్‌‌‌‌‌‌‌‌కు రావడం సహజమేనన్నారు. పోలీసులకు ముందే సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. పిటిషనర్‌‌‌‌‌‌‌‌ బాల్కనీలో ఉండగా కింద తొక్కిసలాట జరిగిందని, దీనికి పిటిషనర్‌‌‌‌‌‌‌‌ను బాధ్యుడిని చేయడం సరికాదన్నారు. ఇది పోలీసులు తమ నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం అన్నారు. రిమాండ్‌‌‌‌‌‌‌‌కు పంపినా క్వాష్‌‌‌‌‌‌‌‌ పిటిషన్‌‌‌‌‌‌‌‌లో మధ్యంతర బెయిలు మంజూరు చేసే అధికారం ఈ కోర్టుకు ఉందని తెలిపారు.

సంఘటనకు కారణం అల్లు అర్జున్‌‌‌‌‌‌‌‌ : పీపీ

సినిమా హాలుకు అల్లు అర్జున్‌‌‌‌‌‌‌‌ రావడం వల్లే ఈ ఘటన చోటుచేసుకుందని పీపీ తెలిపారు. హీరో, హీరోయినట్లు థియేటర్‌‌‌‌‌‌‌‌కు రావద్దని ఎస్‌‌‌‌‌‌‌‌హెచ్‌‌‌‌‌‌‌‌వో చెప్పినా పట్టించుకోకుండా వచ్చారన్నారు. థియేటర్‌‌‌‌‌‌‌‌ యాజమాన్యం, హీరో.. పోలీసులకు సమాచారం ఇచ్చినంత మాత్రాన అనుమతి మంజూరు చేసినట్లు కాదన్నారు. నిందితుడిని అరెస్ట్‌‌‌‌‌‌‌‌ చేసి రిమాండ్‌‌‌‌‌‌‌‌కు తరలించామని, అందువల్ల ప్రత్యామ్నాయాలు చూసుకోవాలన్నారు. గతంలో క్వాష్‌‌‌‌‌‌‌‌ పిటిషన్‌‌‌‌‌‌‌‌లో మధ్యంతర బెయిలు మంజూరు చేసిన కేసుల్లోని వాస్తవాలకు, ఇందులోని వాస్తవాలకు తేడా ఉందని, అందువల్ల ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయరాదన్నారు.