బాలిక 20 వారాల గర్భం తొలగింపునకు హైకోర్టు అనుమతి

బాలిక 20 వారాల గర్భం తొలగింపునకు హైకోర్టు అనుమతి

హైదరాబాద్, వెలుగు : ఓ బాలిక 20 వారాల గర్భం తొలగింపునకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు అబార్షన్​ చేయాలని గాంధీ ఆస్పత్రికి ఆదేశాలు జారీ చేసింది. ఓ బాలికపై ఆరు నెలలకుపైగా పది మంది కామాంధులు అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో ఆమె గర్భం దాల్చింది. అయితే, బాలిక అవాంఛనీయ గర్భం తొలగింపునకు గాంధీ ఆస్పత్రికి వెళితే డాక్టర్లు నిరాకరించారు. దీనిపై బాలిక తల్లి హైకోర్టులో పిటిషన్‌‌‌‌ వేశారు.

అడ్వకేట్‌‌‌‌ వసుధా నాగరాజ్‌‌‌‌ వాదిస్తూ.. కొందరు దుర్మార్గుల వల్ల ఏపాపం తెలియని బాలిక గర్భం దాల్చిందని, అబార్షన్​ చేయకపోతే ఆమె శారీరక, మానసిక వేదనకు లోనవుతుందని చెప్పారు. గైనకాలజిస్ట్, రేడియాలజిస్ట్‌‌‌‌ తదితర డాక్టర్లతో మెడికల్‌‌‌‌ బోర్డు ఏర్పాటు చేసి తగిన చర్యలకు ఉత్తర్వులు ఇవ్వాలన్నారు. దీంతో హైకోర్టు గతంలోనే ఉత్తర్వులు ఇచ్చింది. బాధిత బాలిక ఆరోగ్య పరిస్థితిపై రిపోర్టు ఇవ్వాలని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌‌‌‌ను ఆదేశించింది.

రిపోర్టును సూపరింటెండెంట్‌‌‌‌ సీల్డ్‌‌‌‌ కవర్‌‌‌‌లో అందజేశారు. దీనిని పరిశీలించిన కోర్టు.. ఇది దారుణమైన విషయమని, బాలిక భవిష్యత్తును పరిగణనలోకి తీసుకుని గర్భం తొలగింపునకు ఉత్తర్వులు జారీ చేస్తున్నట్టు ప్రకటించింది.