హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ ఖాజాగూడలోని బ్రహ్మనికుంట ప్రాంతంలో ఆక్రమణలను నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేతలు చేపట్టడంపై హైకోర్టు మంగళవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాగైతే హైడ్రా కమిషనర్ ను మరోసారి కోర్టుకు పిలిపించాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఖాజాగూడలో చెరువు ఎఫ్‌టీఎల్ ప్రాంతమంటూ నిర్మాణాలను కూల్చివేయడాన్ని సవాలు చేస్తూ మేకల అంజయ్య తదితరులు మంగళవారం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై జస్టిస్ కె.లక్ష్మణ్ విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ శేరిలింగంపల్లి మండలం ఖాజాగూడ గ్రామంలోని సర్వే నెం.18/ఇలో 12640 చదరపు గజాల స్థలంలో నిర్మాణాలు ఎఫ్‌టీఎల్‌లో ఉన్నాయంటూ నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేతలు చేపట్టారన్నారు. హైడ్రా తరఫు న్యాయవాది కటిక రవీందర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ హైడ్రా అధికారులు అక్కడ విచారించిన తరువాతనే చర్యలు చేపట్టారన్నారు.
జీహెచ్‌ఎంసీ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఎలాంటి అనుమతుల్లేకుండా పిటిషనర్లు నిర్మాణాలు చేపట్టారన్నారు. నోటీసులు జారీ చేసి కనీసం బాధితుల వివరణ తీసుకోకుండా కూల్చివేతలు ఎలా చేపడతారని హైకోర్టు నిలదీసింది. ఎఫ్‌టీఎల్‌ను నిర్ధారిస్తూ నోటిఫికేషన్ జారీ చేశారా? అని ప్రశ్నించారు. తాజాగా నోటీసులు జారీ చేసి పిటిషనర్ల వివరణ తీసుకుని, చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనుమతుల్లేకుండా పిటిషనర్లు ఏవైనా నిర్మాణాలు చేపట్టినట్లయితే వాటిని జీహెచ్‌ఎంసీ కూల్చివేయవచ్చంటూ విచారణను ముగించింది.