హైదరాబాద్, వెలుగు: కోర్టులో కేసు నడుస్తున్న ఇంటిని కూల్చేసేందుకు జీహెచ్ఎంసీ ఎందుకంత అత్యుత్సాహం చూపుతోందని హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. కూల్చివేత నోటీసును సింగిల్ జడ్జి కొట్టేస్తే దానికి వ్యతిరేకంగా జీహెచ్‌ఎంసీ అప్పీల్ పిటిషన్ దాఖలు చేయడాన్ని తప్పుపట్టింది. అప్పీల్‌ను డిస్మిస్ చేసి జీహెచ్‌ఎంసీ జారీ చేసిన ఇంటి కూల్చివేత నోటీసును రద్దు చేసింది. హైదరాబాద్ ఎల్లారెడ్డిగూడలో 133 గజాల జాగాలోని ఇంటి వివాదంపై ఇద్దరు వ్యక్తుల మధ్య సివిల్ కోర్టులో కేసు నడుస్తోంది. అయితే వివాదంలో ఉన్న ఇంటి కూల్చివేతపై జీహెచ్‌ఎంసీ ఎందుకంత అత్యుత్సాహం చూపుతోందని ఈ మేరకు బుధవారం హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ, జస్టిస్ అభినంద్ కుమార్ షావిలితో కూడిన డివిజన్ బెంచ్ ప్రశ్నించింది.
కూల్చివేత నోటీసును కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇంటిని కూల్చివేస్తామని జీహెచ్‌ఎంసీ ఇచ్చిన నోటీసును గౌసియా బేగం సవాల్ చేయగా.. ఆ నోటీసును సింగిల్ జడ్జి కొట్టేశారు. దీనిపై జీహెచ్‌ఎంసీ అప్పీల్ చేయగా.. డివిజన్ బెంచ్ కూడా కొట్టేసింది. ఆ ఇల్లు తనదంటూ బి.సరిత వేసిన కేసుపై విచారణ చేపట్టిన సివిల్ కోర్టు స్టే ఇచ్చింది. అయితే, సరిత ఫిర్యాదు మేరకు ఇంటిని కూల్చివేస్తామంటూ జీహెచ్ఎంసీ నోటీసు ఇవ్వడాన్ని హైకోర్టు తప్పుపట్టింది.