ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం మానుకోండి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై హైకోర్టు సీరియస్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో విద్యాహక్కు చట్టం ఎందుకు అమలు చేయడం లేదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టు ప్రశ్నించింది. ప్రైవేట్, అన్ ఎయిడెడ్ విద్యా సంస్థల్లో 25 శాతం సీట్లను పేద పిల్లలకు ఎందుకు కేటాయించడం లేదో చెప్పాలంది. దీనిపై రెండు వారాల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. రాష్ట్రంలో విద్యాహక్కు చట్టం అమలు కావడం లేదని వనపర్తి జిల్లాకు చెందిన వై.తిప్పారెడ్డి రాసిన లెటర్ ను హైకోర్టు పిల్‌గా తీసుకుంది. ఇదే అంశంపై వేర్వేరుగా ఫైల్ అయిన మరో 8 పిల్స్ పై చీఫ్ జస్టిస్ ఆర్‌ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డిల డివిజన్ బెంచ్ బుధవారం విచారణ చేపట్టింది. చట్టంలో ఉన్న మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఫండ్స్ కేటాయించాయా? అని హైకోర్టు అడిగింది. కేంద్రం తరఫున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ ఎన్.రాజేశ్వర్‌రావు వాదనలు వినిపిస్తూ… ‘‘ప్రైవేట్, అన్‌ఎయిడెడ్ విద్యా సంస్థలు రాష్ట్ర ప్రభుత్వాల అధీనంలో ఉంటాయి. వాటిలో ఎన్ని సీట్లున్నాయో రాష్ట్రమే చెప్పాలి. ఆ వివరాలు ఇవ్వాలని 2018లోనే లెటర్ రాస్తే ఇంతవరకు స్పందించలేదు. డేటా ఇస్తే 60 శాతం ఫండ్స్ ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది. మిగిలిన 40 శాతం రాష్ట్రమే కేటాయించాలి” అని హైకోర్టుకు వివరించారు. అయితే కేంద్రం అడిగిన డేటాను 2019లోనే రాష్ట్ర సర్కార్ అందజేసిందని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సంజీవ్ కుమార్ తెలిపారు. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం మానుకోవాలని హైకోర్టు సీరియస్ అయింది. అర్హులైన వారిని గుర్తించి రెండు వారాల్లోనే రిపోర్టు అందజేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను నవంబర్ 4కి వాయిదా వేసింది.