- మేం చెప్పేదాకా చట్టాలు అమలు చేయరా..?
- ఆఫీసర్ల పనితీరు ఎమోషన్స్ లేని ఏలియన్స్‌లా ఉందని ఆగ్రహం
- ఇంటర్ బోర్డు ఉద్యోగుల విభజనపై తీర్పు వాయిదా
హైదరాబాద్, వెలుగు: కోర్టు ఉత్తర్వులిస్తే గానీ చట్టాన్ని అమలు చేయరా అని తెలంగాణ, ఏపీ ఇంటర్ బోర్డుల అధికారులను తెలంగాణ హైకోర్టు నిలదీసింది. బోర్డు ఉద్యోగుల విభజనపై రెండు తెలుగు రాష్ట్రాలు చొరవ చూపకపోవడాన్ని తప్పబట్టింది. జీతాలు తీసుకుంటే సరిపోదని, చట్ట ప్రకారం విడిపోయిన ఇంటర్ బోర్డులోని ఉద్యోగులు ఎదుర్కొనే కష్టాల కోణంలో సమస్యను చూడాలని బోర్డు అధికారులకు చెప్పింది. ఎమోషన్స్ లేని ఏలియన్స్‌లా ఆఫీసర్ల పనితీరు ఉందని నిప్పులు చెరిగింది. ఏపీ పునర్ విభజన చట్టం ప్రకారం రెండు ఇంటర్ బోర్డుల ఉద్యోగుల విభజనకు ఉత్తర్వులివ్వాలని దాఖలైన వ్యాజ్యంలో తీర్పును హైకోర్టు వాయిదా వేసింది. ఏపీ ఇంటర్ బోర్డులో సూపరింటెండెంట్లుగా పనిచేస్తున్న ఎస్.సావిత్రి, కె.వెంకటేశ్వరరావు, జి.వెంకటరావు వేసిన వ్యాజ్యాలపై తీర్పును రిజర్వులో పెడుతున్నట్లు ప్రకటించింది. పునర్ విభజన చట్టంలోని సెక్షన్ 82 ప్రకారం ఉద్యోగులను విభజించాలన్న రిట్ పిటిషన్‌ను న్యాయమూర్తులు జస్టిస్ ఎమ్మెస్ రామచంద్రరావు, జస్టిస్ టి.వినోద్‌కుమార్‌ల ధర్మాసనం సోమవారం విచారించింది.
కూర్చొని పరిష్కరించుకోలేరా?
విభజనకు సంబంధించి ఒక కేసులో హైకోర్టు 3 నెలల గడువు ఇచ్చిందని, ఈ కేసులోనూ 3 నెలలు గడువు కావాలని తెలంగాణ ప్రభుత్వ లాయర్ రాజీవ్‌రెడ్డి కోరడంపై బెంచి అసంతృప్తి వ్యక్తం చేసింది. అధికారులు కూర్చుని సెటిల్ చేయడానికి ఎందుకు చొరవ చూపడం లేదని, ఆఫీసర్లు తీరు ఆశ్చర్యంగా, హాస్యాస్పదంగా ఉందని మండిపడింది. రెండు బోర్డుల అధికారులకు ఫైన్ వేస్తామని హెచ్చరించింది.
ఇవి కూడా చదవండి
ఏపీ నీళ్ల లెక్క సరిదిద్దాలె..కేఆర్ఎంబీకి తెలంగాణ లెటర్
ప్రాజెక్టులను తెలంగాణ అక్రమంగా కడ్తోంది..కృష్ణా బోర్డుకు ఏపీ సర్కారు ఫిర్యాదు
మన హైదరాబాద్ వ్యాక్సిన్ క్యాపిటల్