సవరించిన ఎంవీ యాక్ట్ 2019 ఎప్పటి నుంచి అమలు చేస్తరు?

సవరించిన ఎంవీ యాక్ట్ 2019 ఎప్పటి నుంచి అమలు చేస్తరు?
  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించిన హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: సవరించిన మోటార్‌‌‌‌ వాహనాల చట్టం 2019ను ఎప్పటి నుంచి అమలు చేస్తారో చెప్పాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు ప్రశ్నించింది. తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేస్తూ.. ఆ లోగా కౌంటర్‌‌‌‌ దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర రవాణా శాఖ కార్యదర్శి, రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్‌‌‌‌కు నోటీసులు ఇచ్చింది. మద్యం తాగి, హెవీ లోడ్​తో, హెల్మెట్‌‌‌‌ లేకుండా.. ఇలా పలు ఉల్లంఘనలకు శిక్షలు కఠినతరం చేస్తూ మోటార్‌‌‌‌ వాహనాల చట్టంలో ఆగస్టు 2019లో కేంద్రం సవరణ తీసుకొచ్చింది.

అయితే, వీటిని అమలు చేయలా.. వద్దా.. అన్నది రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయానికే వదిలేసింది. సవరణ తీసుకొచ్చి ఐదేండ్లు కావొస్తున్నా రాష్ట్రంలో ఈ చట్టాన్ని అమలు చేయడంలేదని, అమలు చేసేలా ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో హైదరాబాద్‌‌‌‌ గౌలిగూడకు చెందిన రమణ్‌‌‌‌జీత్‌‌‌‌ సింగ్‌‌‌‌ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలోని హైదరాబాద్ నగరంలో తగిన సంఖ్యలో ప్రత్యేక న్యాయస్థానాలను ఏర్పాటు చేసి, సవరించిన ఎంవీ యాక్ట్ కింద నిబంధనలు ఉల్లంఘించిన వారిని విచారించేలా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని పేర్కొన్నారు.

చట్టం అమలు చేస్తే ప్రమాదాలు తగ్గుతాయని, మద్యం తాగి వాహనాలు నడిపే వారిని అరికట్టొచ్చని తెలిపారు. అధ్యయనానికి ఓ కమిటీ వేసేలా రాష్ట్ర ప్రభుత్వానికి దిశానిర్ధేశం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌‌‌‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌‌‌‌ ఆలోక్‌‌‌‌ అరాధే, జస్టిస్‌‌‌‌ జె.శ్రీనివాస్‌‌‌‌ రావు శుక్రవారం విచారణ చేపట్టారు. వాదనలు విన్న ధర్మాసనం.. సమస్యను న్యాయస్థానం కూడా పరిగణనలోకి తీసుకుంటున్నదని  వ్యాఖ్యానించింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ విచారణ వాయిదా వేసింది.