యూట్యూబ్‌కు హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, వెలుగు: వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించే వీడియోలను తొలగించాలని యూట్యూబ్‌ను హైకోర్టు ఆదేశించింది. కోకాపేటకు చెందిన శివయ్య, ఆయన భార్య, కుమారుడిపై ‘మీమాంస విక్టిమ్స్’ యూట్యూబ్ చానల్‌లో ఉన్న వీడియోలను తొలగించాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. తమ వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేలా కథనాలు ‘మీమాంస యూట్యూబ్’ చానెల్ లో ఉన్నాయని, ఆ అంశాలను తొలగించకపోవడాన్ని సవాలుచేస్తూ శివయ్య కుటుంబ సభ్యులు దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ ఎన్‌వీ శ్రవణ్ కుమార్ విచారించారు.
పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్.. ఆస్తుల క్రయ, విక్రయాల వ్యాపారాలకు సంబంధించి పలువురికి సలహాలు ఇస్తుంటారన్నారు. అదేవిధంగా బాచుపల్లికి చెందిన ఎ.మురళీకృష్ణ దంపతులు పిటిషనర్ సలహాతో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేశారని, వ్యాపారంలో అనుకున్న లాభాలు రాలేదన్న కారణంతో పిటిషనర్లపై కేసులు పెట్టారని తెలిపారు.
ఈ వివాదానికి సంబంధించిన కేసులు పెండింగ్‌లో ఉండగా మురళీకృష్ణ దంపతులు ‘మీమాంస విక్టిమ్స్’ పేరుతో యూట్యూబ్ చానల్ ఏర్పాటు చేసి పిటిషనర్ల ఫొటోలతో సహా వారి ప్రతిష్టను దెబ్బతీసేలా వీడియోలు అప్‌లోడ్ చేశారని పేర్కొన్నారు. వీడియోలను తొలగించాలని యూట్యూబ్‌కు లేఖ రాసినా పట్టించుకోలేదన్నారు. వాదనలను విన్న హైకోర్టు.. ఒకరి వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతీసేలా వీడియోలను పెట్టకూడదని చెప్పింది.