టీచర్ల ప్రమోషన్లకు హైకోర్టు బ్రేక్

టీచర్ల ప్రమోషన్లకు హైకోర్టు బ్రేక్
  • టెట్‌ను పరిగణనలోకి తీసుకోకపోవడంపై అసహనం
  • ప్రమోషన్లకు సీనియారిటీ జాబితాను రెడీ చేసిన విద్యాశాఖపై సీరియస్​
  • గతంలో ఇచ్చిన ఉత్తర్వులే అమలులో ఉంటాయని పేర్కొంటూ విచారణ క్లోజ్‌

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలో టీచర్ల ప్రమోషన్లకు హైకోర్టు బ్రేక్ ​వేసింది. 2010కి ముందు ఎస్జీటీలుగా ఉన్న ఉపాధ్యాయులకు స్కూల్‌ అసిస్టెంట్లుగా ప్రమోషన్​ కల్పించేందుకు టెట్‌ అర్హతను పరిగణనలోకి తీసుకోకుండా సీనియారిటీ జాబితాను రూపొందించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అంశంలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ శ్రీదేవసేనపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 2010కి ముందు ఉన్న టీచర్లకు టెట్‌ను పరిగణనలోకి తీసుకోవద్దంటూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్వర్వులను డివిజన్‌ బెంచ్‌ రద్దు చేసి తిరిగి సింగిల్‌ జడ్జికి పంపిన విషయం తెలిసి కూడా ప్రమోషన్స్‌ ఎలా చేపడతారని ప్రశ్నించింది. ఇది కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించడమేనని ఫైర్ అయ్యింది. పదోన్నతులకు సంబంధించి ఎలాంటి కొత్త ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. 

స్కూల్ అసిస్టెంట్‌‌‌‌ పోస్టుల పదోన్నతుల్లో భాగంగా టెట్‌‌‌‌లో అర్హత సాధించని ఎస్జీటీలకు అవకాశం కల్పించకపోవడాన్ని సవాలు చేస్తూ గతంలో 150 మందిదాకా హైకోర్టులో పిటిషన్‌‌‌‌ దాఖలు చేశారు. దీనిపై విచారించిన సింగిల్‌‌‌‌ జడ్జి.. టెట్‌‌‌‌తో సంబంధం లేకుండా పదోన్నతులు కల్పించాలని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ 52 మంది హైకోర్టులో అప్పీలు దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌‌‌‌ అభినంద్‌‌‌‌ కుమార్‌‌‌‌ షావిలి, జస్టిస్‌‌‌‌ అలిశెట్టి లక్ష్మీనారాయణలతో కూడిన ధర్మాసనం ఈ నెల 14న విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫు న్యాయవాది పీఎస్‌‌‌‌.రాజశేఖర్‌‌‌‌ వాదనలు వినిపిస్తూ.. టెట్‌‌‌‌ అర్హత లేనివారికి స్కూల్‌‌‌‌ అసిస్టెంట్‌‌‌‌ పోస్టుల పదోన్నతులకు అవకాశం కల్పిస్తే అన్యాయం జరుగుతుందన్నారు. 

ప్రతివాదుల తరఫు న్యాయవాది ఎం.రాంగోపాల్‌‌‌‌రావు వాదనలు వినిపిస్తూ.. అభ్యర్థులు 1995–1998 మధ్య ఎస్జీటీలుగా నియమితులయ్యారని తెలిపారు. అయితే.. ఎన్‌‌‌‌సీటీఈ నోటిఫికేషన్‌‌‌‌ 2010లో వచ్చిందని తెలిపారు. ఎన్‌‌‌‌సీటీఈ నిబంధనల ప్రకారం.. స్కూల్‌‌‌‌ అసిస్టెంట్‌‌‌‌ పోస్టులకు టెట్‌‌‌‌ అర్హత తప్పనిసరని గుర్తుచేశారు. అందువల్ల నోటిఫికేషన్‌‌‌‌కు ముందు నియమితులైనవారికి టెట్‌‌‌‌ అవసరం లేదంటూ 2015లో ప్రభుత్వం జీవో 36 జారీ చేసిందన్నారు. మరో పిటిషన్‌‌‌‌లో ఎన్‌‌‌‌సీటీఈ నోటిఫికేషన్‌‌‌‌ ప్రకారం పదోన్నతులు చేపట్టాలంటూ మరో సింగిల్‌‌‌‌ జడ్జి ఉత్తర్వులు జారీ చేశారన్నారు. వాదనలను విన్న ధర్మాసనం వివాదాన్ని తిరిగి సింగిల్‌‌‌‌ జడ్జి వద్దకే పంపింది. 

ఎన్‌‌‌‌సీటీఈ నోటిఫికేషన్‌‌‌‌ ప్రకారం 

జరగాలన్న అంశాన్ని, జీవో 36ను అమలు చేయాలన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకుని తీర్పు ఇవ్వాలని సూచించింది. ఇవి సింగిల్‌‌‌‌ జడ్జి వద్ద 
పెండింగ్‌‌‌‌లోనే ఉన్నాయి. 

మరో వైపు ప్రమోషన్స్ ప్రక్రియ స్టార్ట్

స్కూల్‌‌‌‌ అసిస్టెంట్‌‌‌‌ పోస్టులకు టెట్‌‌‌‌ అర్హత అంశం  సింగిల్‌‌‌‌ జడ్జి వద్ద పెండింగ్‌‌‌‌లో ఉండగానే ప్రభుత్వం పదోన్నతుల ప్రక్రియను ప్రారంభించింది. దీనిపై జస్టిస్‌‌‌‌ అభినంద్‌‌‌‌కుమార్‌‌‌‌ షావిలి, జస్టిస్‌‌‌‌ అలిశెట్టి లక్ష్మీ నారాయణలతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారించింది.  ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. అప్పీలు దాఖలు చేసిన విషయం ప్రభుత్వానికి తెలియదని, లేదంటే కౌంటర్లు దాఖలు చేసేదని తెలిపారు. దీనిపై వివరణ ఇవ్వడానికి తమకు గడువు ఇవ్వాలని కోరారు. అదే సమయంలో.. కోర్టుకు హాజరైన పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌‌‌‌ శ్రీదేవసేనను పదోన్నతుల ప్రక్రియ ఎలా చేపడతారని ధర్మాసనం ప్రశ్నించింది.

ఎన్‌‌‌‌సీటీఈ నిబంధనల ప్రకారమే ప్రక్రియ మొదలుపెట్టామని, ఇందులో టెట్‌‌‌‌ అర్హతలేనివారినీ పరిగణనలోకి తీసుకున్నామని ఆమె చెప్పడాన్ని ఆక్షేపించింది. సింగిల్‌‌‌‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసి వెనక్కి పంపిన విషయాన్ని తెలిసి ప్రక్రియను ఎలా చేపడతారని నిలదీసింది. ఈ నెల 14న ఇచ్చిన ఉత్తర్వులే అమల్లో ఉంటాయని, తాజాగా ఎలాంటి ఆదేశాలివ్వలేమంటూ అప్పీళ్లపై విచారణను క్లోజ్‌‌‌‌ చేసింది.