గ్రూప్‌–1 మెయిన్స్ ఎగ్జామ్స్కు లైన్ క్లియర్.. అప్పీల్‌ పిటిషన్లను కొట్టేసిన హైకోర్టు

గ్రూప్‌–1 మెయిన్స్ ఎగ్జామ్స్కు లైన్ క్లియర్.. అప్పీల్‌ పిటిషన్లను కొట్టేసిన హైకోర్టు

హైదరాబాద్: గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ రద్దుకు నిరాకరిస్తూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన అప్పీల్ పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. దీంతో.. గ్రూప్‌–1 ఎగ్జామ్స్కు లైన్ క్లియర్ అయింది. సింగిల్ బెంచ్ తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ సమర్థించింది. చివరి నిమిషంలో పరీక్ష రద్దు సాధ్యం కాదని హైకోర్టు డివిజన్ బెంచ్ కీలక వ్యాఖ్యలు చేసింది. 8 మంది పిటిషనర్ల కోసం లక్షల మంది ఎందుకు ఇబ్బంది పడాలని ధర్మాసనం ప్రశ్నించింది. ఇప్పటికే పరీక్ష రెండుసార్లు రద్దయిందని గుర్తుచేసింది. పరీక్షల కోసం ఎంతోమంది నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారని, పరీక్షలు వాయిదా వేయాలని ఆదేశాలు ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది.

ఈ నెల (అక్టోబర్, 2024) 21 నుంచి గ్రూప్1 మెయిన్స్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. 27 వరకూ పరీక్షలు జరగనున్నాయి. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు 31,383 మంది అభ్యర్థులు హాజరవుతున్నారు. వీరి కోసం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్  జిల్లాల్లో 46 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్లో 8, రంగారెడ్డి జిల్లాలో 11, మేడ్చల్  మల్కాజిగిరి జిల్లాలో 27  పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని అధికారులు వెల్లడించారు. ప్రతి పరీక్ష కేంద్రంలోనూ సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. 

ALSO READ | సుప్రీంకోర్టును ఆశ్రయించిన గ్రూప్ 1 అభ్యర్థులు

టీజీపీఎస్సీ ఆఫీసులో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ద్వారా పరీక్షల తీరును అధికారులు పర్యవేక్షించనున్నారు. మధ్యాహ్నం ఒకటిన్నర తర్వాత పరీక్ష కేంద్రంలోకి అభ్యర్థులను అనుమతించేది లేదని స్పష్టం చేశారు. ఇప్పటికే 85 శాతం అభ్యర్థులు తమ హాల్ టికెట్లను  డౌన్లోడ్  చేసుకున్నారని తెలిపారు. వికలాంగులకు ఒక గంట అదనంగా కేటాయిస్తామని అధికారులు చెప్పారు.