హైడ్రా ఏర్పాటును తప్పుపట్టలేం...ఆ అధికారం ప్రభుత్వానికి ఉంది: హైకోర్టు

హైడ్రా ఏర్పాటును తప్పుపట్టలేం...ఆ అధికారం ప్రభుత్వానికి ఉంది: హైకోర్టు
  • ఎఫ్‌‌‌‌‌‌‌‌టీఎల్, బఫర్‌‌‌‌‌‌‌‌ జోన్ల రక్షణకు చర్యలు తీసుకోవాలనిసుప్రీంకోర్టు కూడా చెప్పింది
  • అధికారుల చర్యలు నిబంధనలకు లోబడేఉండాలని వ్యాఖ్య
  • హైడ్రాకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై విచారణ

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) ఏర్పాటును తప్పుపట్టలేమని హైకోర్టు తేల్చిచెప్పింది. హైడ్రా ఏర్పాటు జీవో 99, హైడ్రా చర్యలను సవాలు చేస్తూ దాఖలైన వేర్వేరు వ్యాజ్యాలపై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. హైడ్రాను ఏర్పాటు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని స్పష్టం చేసింది. నిజాం కాలంలోని రెవెన్యూ చట్టాన్ని పరిశీలిస్తే చెరువులు, కుంటల రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రభుత్వానికి ఉన్న అధికారాలు స్పష్టమవుతాయని పేర్కొంది.

ఆ చట్టం ప్రకారం ఏ రెవెన్యూ అధికారి అయినా, ఎప్పుడైనా సర్వే చేయవచ్చునని చెప్పింది. ఈ వ్యవహారాల పర్యవేక్షణకు అధికారిని నియమించే అధికారం కూడా ప్రభుత్వానికి ఉందని, ఈ క్రమంలో హైడ్రా ఏర్పాటు జరిగిందని తెలిపింది. నిజాం కాలం నాటి రెవెన్యూ చట్టం ప్రకారం నోటీసు కూడా జారీ చేయాల్సిన అవసరం లేదని, ఎఫ్‌‌‌‌‌‌‌‌టీఎల్, బఫర్‌‌‌‌‌‌‌‌ జోన్లలో సర్వే చేసి అక్కడ ఉండే నిర్మాణాలు, ఆక్రమణలను కూల్చివేసే అధికారం ఉంటుందని తెలిపింది. ఆనాటి రెవెన్యూ చట్టానికి అనుగుణంగానే ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌ చట్టం కూడా రూపొందిందని వివరించింది.

ఎఫ్‌‌‌‌‌‌‌‌టీఎల్, బఫర్‌‌‌‌‌‌‌‌జోన్ల రక్షణకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఒక కేసులో సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను ఆదేశించిందని గుర్తు చేసింది. మూసీ ప్రాంతంలోని తమ ఇండ్లపై ఎర్ర అక్షరాలతో ఆర్‌‌‌‌‌‌‌‌బీ–ఎక్స్‌‌‌‌‌‌‌‌ అని మార్కింగ్‌‌‌‌‌‌‌‌ చేశారని, కూల్చివేత చర్యలు తీసుకునే అవకాశం ఉందంటూ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ నగరంలోని పేట్ల బుర్జు ప్రాంతానికి చెందిన ఎస్‌‌‌‌‌‌‌‌.మహేందర్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌ దాస్‌‌‌‌‌‌‌‌ సహా 15 మంది పిటిషన్లు దాఖలు చేశారు.

హైడ్రా ఏర్పాటు జీవో 99కు చట్టబద్ధత లేదంటూ నానక్‌‌‌‌‌‌‌‌ రాంగూడకు చెందిన డి.లక్ష్మి, మల్కాజిగిరికి చెందిన ఎండీ అహ్మద్‌‌‌‌‌‌‌‌ అజీమ్‌‌‌‌‌‌‌‌ వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై మంగళవారం విచారణ చేపట్టిన జస్టిస్‌‌‌‌‌‌‌‌ సీవీ భాస్కర్‌‌‌‌‌‌‌‌రెడ్డి పై వ్యాఖ్యలు చేశారు. మూసీకి సంబంధించిన కేసులో చట్ట నిబంధనలకు లోబడి అధికారుల చర్యలు ఉండాలని ఆదేశించారు. ఈ పిటిషన్‌‌‌‌‌‌‌‌పై విచారణ ముగిసినట్టు ప్రకటించారు. జీవో 99ను సవాలు చేసిన పిటిషన్లల్లో ప్రభుత్వం తమ వాదనలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించారు.  

హైడ్రా చర్యలపై స్టే ఇవ్వాలి..

తొలుత పిటిషనర్ల అడ్వకేట్లు టి.సుధాకర్‌‌‌‌‌‌‌‌రెడ్డి, జె.విజయలక్ష్మి వాదనలు వినిపిస్తూ.. ప్రైవేట్‌‌‌‌‌‌‌‌ పట్టా భూముల్లోకి హైడ్రా అధికారులు దౌర్జన్యంగా చొరబడి నోటీసు కూడా ఇవ్వకుండా నిర్మాణాలను కూల్చివేశారని చెప్పారు. జీవో ద్వారా హైడ్రా ఏర్పాటుకు చట్టబద్ధత ఏర్పడదని చెప్పారు. చట్టసభ ద్వారా వాల్టా వంటివి ఏర్పాటు చేసినట్టుగానే హైడ్రా కూడా ఏర్పాటు కావాలని, హైడ్రాకు చట్టబద్ధత లేదన్నారు.

హైడ్రా చర్యలను నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. దీనిపై స్పందించిన జడ్జి.. హైడ్రా చర్యలు చట్ట నిబంధనలకు లోబడి ఉండాలని సోమవారమే ఉత్తర్వులు జారీ చేశామని, స్టేటస్‌‌‌‌‌‌‌‌కో ఉత్తర్వులు జారీ చేసినట్టు చెప్పారు. అయినా, జీవో 99ను సవాలు చేసిన వ్యాజ్యాలను డివిజన్‌‌‌‌‌‌‌‌ బెంచ్‌‌‌‌‌‌‌‌ విచారణ చేయాల్సి ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం కౌంటర్‌‌‌‌‌‌‌‌ దాఖలు చేస్తే తదుపరి విచారణలో తగిన ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు.

అదనపు అడ్వకేట్‌‌‌‌‌‌‌‌ జనరల్‌‌‌‌‌‌‌‌ కల్పించుకొని.. జీవో ద్వారా హైడ్రా ఏర్పాటు తర్వాత ఆర్డినెన్స్‌‌‌‌‌‌‌‌ కూడా వెలువడిందని, కాబట్టి జీవోను సవాలు చేసిన పిటిషన్లకు విచారణార్హత ఉండదన్నారు. విచారణను ఈ నెల 28వ తేదీకి వాయిదా వేశారు.