తెలంగాణలో గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జూన్ 9న జరుగనుంది. గ్రూప్-1 పరీక్ష వాయిదా వేయడానికి హైకోర్టు నిరాకరించింది. పరీక్ష నిర్వహణకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తిచేసిందని, ఈ సమయంలో పరీక్ష వాయిదాపై నిర్ణయం తీసుకోలేమని కోర్టు చెప్పింది. పిటిషనర్లు ఇచ్చిన వినతిపత్రాన్ని పరిశీలించి, దీనిపై టీజీపీఎస్సీ (TGPSC) తుది నిర్ణయం తీసుకోవాలని ఆదేశిస్తూ పిటిషన్‌పై విచారణను ముగించింది.
జూన్ 9న ఇంటెలిజెన్స్ బ్యూరోలో అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్-1, ఎగ్జిక్యూటివ్ పోస్టులకు స్క్రీనింగ్ టెస్టులు ఉన్నాయి. అదే రోజు ఉన్న గ్రూప్-1 ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ వాయిదావేయాలంటూ ఎం.గణేశ్, భూక్యా భరత్‌లు జూన్ 1న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జూన్ 4న జస్టిస్ పుల్లా కార్తీక్ విచారణ చేపట్టారు. తెలంగాణలో కేవలం 2 ఇంటెలిజెన్స్ పోస్టులకు 700 మంది అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకున్నారని, అదే గ్రూప్-1 పోస్టులకు 4 లక్షలకు పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు.
కేవలం కొంత మంది ప్రయోజనాల కోసం.. లక్షల మంది భవిష్యత్తును పణంగా పెట్టడం సరికాదన్నారు. కమిషన్ న్యాయవాది వాదనలతో న్యాయమూర్తి ఏకీభవించారు. పరీక్ష వాయిదా వేయడానికి నిరాకరిస్తూ.. దీనిపై కమిషన్ తుది నిర్ణయం తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. ఇప్పటికే హాల్ టికెట్లు కూడా అభ్యర్థులు తీసుకున్నారు.