- 2016 నుంచి అక్రమంగా లబ్ధి పొందిన 127 మంది నుంచి సబ్సిడీ సొమ్ము రికవరీకి ఆర్డర్స్
- మ్యాక్స్ సంఘాలుగా ఏర్పడి బతుకమ్మ చీరల ఆర్డర్స్ పొందిన బడా వ్యాపారులు
- హైకోర్టు తీర్పుతో ప్రతి నెలా రూ.1.50 కోట్ల అదనపు చెల్లింపులు
రాజన్నసిరిసిల్ల, వెలుగు:
సిరిసిల్ల అక్రమంగా విద్యుత్ సబ్సిడీ పొందుతున్న బడా ఆసాములకు హైకోర్టు షాక్ ఇచ్చింది. ఇంతకాలం కేటగిరీ -4లో కుటీర పరిశ్రమ కింద ఆసాములకు ప్రభుత్వం విద్యుత్ సబ్సిడీ ఇస్తూ వచ్చింది. 2016 నుంచి రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ చీరల తయారీకి ఆర్డర్స్ ఇవ్వడంతో వందలాది సాంచాలున్న పెద్ద వ్యాపారులు కూడా ఎస్ఎస్ఐ(స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ) కింద రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అప్పటినుంచి వీరు 50శాతం కరెంట్ సబ్సిడీ పొందుతున్నారు. దీనిపై కొందరు హైకోర్టును ఆశ్రయించడంతో పెద్ద వ్యాపారులకు సబ్సిడీని ఎత్తివేయాలని హైకోర్టు ఆర్డర్స్ ఇవ్వడం విశేషం.
నేతన్నలను ఆదుకునేందుకు సబ్సిడీ
సిరిసిల్ల నేతన్నలను ఆదుకునేందుకు రెండు దశాబ్దాల కింద అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం వస్త్ర పరిశ్రమను కుటీర పరిశ్రమగా గుర్తించింది. దీనిలో భాగంగా సెస్ పరిధిలో కేటగిరి 4 కింద సాంచాలకు 50 శాతం కరెంట్సబ్సిడీని ప్రకటించింది. ఇందులో 10 హెచ్ పీల వరకు అనగా 5 సాంచాలున్న వారికి సబ్సిడీ వర్తించేలా నిబంధనలు విధించింది. అయితే సిరిసిల్లలో బడాసేట్లు బినామీల పేర్లతో కరెంట్మీటర్లు తీసుకొని సబ్సిడీ పొందుతున్నారు. ఫలితంగా సిరిసిల్లలో 5సాంచాలున్న పేద నేతన్నలకు, 100 సాంచాలున్న బడా వ్యాపారులకు ఒకే రాయితీ అందుతోంది.
మ్యాక్స్ సంఘాలుగా ఏర్పడి..
2016లో తెలంగాణ ప్రభుత్వం మొదటిసారిగా సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు బతుకమ్మ చీరల ఆర్డర్లను అందించింది. ఐదు, పది సాంచాలున్న మధ్యతరగతి ఉత్పత్తిదారులు మ్యాక్స్ సంఘాలుగా ఏర్పడి చీరల ఆర్డర్స్ పొందారు. ఇలా 127 మంది బడా వ్యాపారులు ఎస్ఎస్ఐ యూనిట్లుగా నమోదై 2016 నుంచి బతుకమ్మ చీరలను ఉత్పత్తి చేస్తున్నారు. అప్పటి నుంచి చిన్న పరిశ్రమగా పేర్కొంటూ 50 శాతం కరెంట్సబ్సిడీ పొందుతున్నారు.
హైకోర్టు ఆర్డర్స్ తో రికవరీకి ఆదేశాలు బడా సేట్లు అక్రమంగా పొందుతున్న విద్యుత్ రాయితీని సవాలు చేస్తూ సిరిసిల్లకు చెందిన చిమ్మని ప్రకాశ్అనే నేత కార్మికుడు గతేడాది ఫిబ్రవరిలో హైకోర్టును ఆశ్రయించాడు. విచారణ జరిపిన హైకోర్టు ఈ ఏడాది మార్చిలో ఎస్ఎస్ఐ యూనిట్ల కరెంట్ మీటర్లను కేటగిరి 3గా మార్చి కమర్షియల్ బిల్లులు వసూలు చేయాలని ఆదేశించింది. 50 శాతం విద్యుత్ సబ్సిడీని రద్దు చేయాలని తీర్పులో పేర్కొంది. 2016 నుంచి అక్రమంగా రాయితీ పొందిన వారి నుంచి సబ్సిడీ సొమ్మును కూడా రికవరీ చేయాలని తీర్పునిచ్చింది.
రూ.కోట్లలో వసూలు కానున్న బిల్లులు
కేటగిరీ 4లో ప్రతి యూనిట్ కరెంట్ కు రూ.4 బిల్లు వేస్తుండగా, కేటగిరీ 3లో రూ 7.70 చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు సబ్సిడీ ఉండడంతో కేటగిరీ 4 కింద ప్రతినెలా రూ. 6లక్షల నుంచి రూ. 26లక్షల వరకు బిల్లింగ్ అవుతోంది. తాజాగా హైకోర్టు ఆర్డర్ తో మీటర్లను కేటగిరీ 3కి మార్చాల్సి ఉంటుంది. ఈ లెక్కన సాంచాల కార్ఖానాలో ప్రతి మీటర్ కు యూనిట్ కు రూ.7.70 చొప్పున బిల్లులు వేయాల్సి ఉంది. దీంతోపాటు 2016 నుంచి సబ్సిడీ సొమ్ము రికవరీ చేయాల్సి ఉండగా.. ప్రతినెలా రూ.కోటి నుంచి 1.50 కోట్ల అదనపు బిల్లులు వసూలు కానున్నాయి. సిరిసిల్లలో 127 ఎస్ఎస్ఐ యూనిట్ల పరిధిలో దాదాపు 6500 సాంచాలు ఉన్నాయి. హైకోర్టు తీర్పుతో అక్రమంగా లబ్ధిపొందిన బడా వ్యాపారులు మూడు నెలల్లో రాయితీ సొమ్ము చెల్లించాలని సెస్ పాలకవర్గం నోటీసులు
జారీ చేసింది.
హైకోర్టు ఆదేశాలతో నోటీసులు జారీ
హైకోర్టు ఆదేశాలతో 127 ఎస్ఎస్ఐ యూనిట్లను కేటగిరీ 3లోకి మార్చాం. ఈ నెల నుంచే విద్యుత్ సబ్సిడీ లేకుండా బిల్లులు వసూలు చేస్తున్నాం. హైకోర్టు ఆదేశాలను పక్కాగా అమలుచేస్తాం. 2016 నుంచి పొందిన విద్యుత్ సబ్సిడీ వసూలుకు కోర్టు మూడు నెలల గడువు ఇచ్చింది. ఈమేరకు నోటీసులు జారీ చేశాం.
- సెస్ ఎండీ రామకృష్ణ