హైదరాబాద్, వెలుగు : హైదరాబాద్‌లోని దారుల్ షిఫా ఇబాదత్ ఖానా కోసం ముతావలి కమిటీకి తెలంగాణ స్టేట్ వక్ఫ్ బోర్డు ఏడుగురు సభ్యులను నియమిస్తూ ఇచ్చిన ప్రొసీడింగ్స్ చెల్లవని హైకోర్టు తీర్పు చెప్పింది. ఈ మేరకు జస్టిస్ నగేశ్ భీమపాక ఇటీవల తీర్పు వెలువరించారు. ఇబాదత్ ఖానా ఆస్తిని 1953లో ఇద్దరు వాకీఫ్‌లు విరాళంగా ఇచ్చారు. ఆ దాతలు ఇద్దరితోపాటు ఎనిమిది మందితో కమిటీ ఏర్పాటైంది.
వీరంతా తమ వారసుల పేర్లను వెల్లడించకుండానే కన్నుమూశారు.1994లో వక్ఫ్ బోర్డు 10 మంది సభ్యులతో ఒక ముతావలీ కమిటీని ఏర్పాటు చేసింది. వీళ్లు కూడా తమ వారసుల పేర్లను వెల్లడించకుండానే మృతి చెందారు. 2007లో వక్ఫ్ బోర్డు ఒకరిని కమిటీకి అధ్యక్షుడిగా నామినేట్ చేసింది. 2023లో తిరిగి ఏడుగురు సభ్యులతో కమిటీ వేసింది. గతంలో జరిగిన విషయాలను ప్రస్తావించకుండా తాజాగా ప్రొసీడింగ్స్ జారీ చెల్లదని పిటిషనర్ మీర్ లుక్మాన్ అలీ పిటిషన్ వేశారు.
వక్ఫ్‌బోర్డు వాదన తిరస్కరణ
లాయర్ పి.వేణుగోపాల్ వాదనలు వినిపిస్తూ, గతంలో నామినేట్ చేసిన విషయాలను వక్ఫ్‌బోర్డు దాచిపెట్టిందన్నారు. దీనిపై వక్ఫ్ బోర్డు లాయర్ వాదిస్తూ, పిటిషనర్ వక్ఫ్ ట్రిబ్యునల్‌లో కేసు వేయకుండా హైకోర్టును ఆశ్రయించడం చెల్లదన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు.. వక్ఫ్ బోర్డు వాదనను తిరస్కరించింది. 1994, 2007లో జారీ చేసిన ప్రొసీడింగ్స్ప్రస్తావించకుండా తాజా ప్రొసీడింగ్స్ ఇవ్వడం చెల్లదని పేర్కొన్నది.
ముతావలి కమిటీ ఏర్పాటు చెల్లదని తేల్చి చెప్పింది. ఇబాదత్‌ఖానా నిర్వహణ బాధ్యతలను వక్ఫ్ బోర్డే స్వయంగా పర్యవేక్షణ చేయాలని పేర్కొన్నది. చట్ట నిబంధనలకు తగ్గట్టుగా మేనేజింగ్ కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఆ కమిటీ నియామకంలో అక్బరి, ఉసూలి తెగలకు సమాన ప్రాతినిధ్యం కల్పించాలని స్పష్టం చేసింది.