మీపై నమోదైన కేసుల వివరాలివ్వండి : ఎంపీ రఘునందన్‌‌కు హైకోర్టు ఆదేశం

మీపై నమోదైన కేసుల వివరాలివ్వండి : ఎంపీ రఘునందన్‌‌కు హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: వివిధ సందర్భాల్లో నమోదైన క్రిమినల్‌‌ కేసుల విచారణ దశను వివరిస్తూ అఫిడవిట్‌‌ దాఖలు చేయాలని బీజేపీ ఎంపీ ఎం.రఘునందన్‌‌ రావుకు హైకోర్టు ఆదేశాలిచ్చింది. వివిధ పోలీసు స్టేషన్లలో నమోదైన కేసుల పై కోర్టుల్లో విచారణ ఏ దశలో ఉందో చెప్పాలని పేర్కొంది. క్రిమినల్‌‌ కేసులున్నాయన్న కారణంగా రీజనల్‌‌ పాస్‌‌పోర్టు అధికారి తన పాస్‌‌పోర్టును రెన్యూవల్‌‌ చేయకపోవడాన్ని సవాలు చేస్తూ ఎంపీ రఘునందన్‌‌రావు హైకోర్టును ఆశ్రయించారు. దీనిని జస్టిస్‌‌ మౌసమీ భట్టాచార్య విచారించారు. 

పిటిషనర్‌‌ తరఫు న్యాయవాది..పాస్‌‌పోర్టును రెన్యువల్‌‌ చేయకపోవడం చట్టవిరుద్ధమన్నారు. క్రిమినల్‌‌ కేసులున్నప్పటికీ పాస్‌‌పోర్టు నిరాకరించడానికి వీల్లేదన్నారు. కేంద్రం తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఎన్నికల సంఘంతోపాటు పాస్‌‌పోర్టు అధికారులకు తనపై ఉన్న కేసుల జాబితాను పిటిషనర్‌‌ స్వయంగా అందజేశారన్నారు. క్రిమినల్‌‌ కేసులు ఉన్నందున పాస్‌‌పోర్టు రెన్యూవల్‌‌ను తిరస్కరించినట్లు తెలిపారు. వాదనలను విన్న న్యాయమూర్తి..పాస్‌‌పోర్టు అధికారులకు సమర్పించిన కేసులకు సంబంధించి వివిధ కోర్టుల్లో విచారణ ఏ దశలో ఉందో చెప్పాలంటూ రఘునందన్‌‌ ను ఆదేశించారు.