- సికింద్రాబాద్ క్లబ్ కేసులో హైకోర్టు కామెంట్.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు
హైదరాబాద్, వెలుగు: రాజీవ్ రహదారిపై పారడైజ్ జంక్షన్ నుంచి శామీర్‌పేట్ వరకు 18 కిలోమీటర్ల పొడవుతో నిర్మించనున్న ఎలివేటెడ్ కారిడార్ కోసం భూసేకరణ ప్రక్రియ చట్ట ప్రకారం ఉండాలని రాష్ట్రానికి హైకోర్టు ఆదేశించింది. సికింద్రాబాద్ క్లబ్‌కు నోటీసులు జారీ చేసి అభ్యంతరాలు స్వీకరించాలని స్పష్టం చేసింది. హైదరాబాద్‌కు స్టేట్ హైవే–1లో భాగంగా ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనుల కోసం హెచ్‌ఎండీఏకు అనుమతిస్తూ రక్షణ శాఖ జారీ చేసిన ఉత్తర్వులను సికింద్రాబాద్ క్లబ్ తరఫున కార్యదర్శి శ్రీగోగిరెడ్డి హైకోర్టులో సవాల్ చేశారు.
దీనిని జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి సోమవారం విచారించారు. పిటిషనర్ లాయర్ వాదిస్తూ.. ఎలివేటెడ్ కారిడార్ అనుమతుల కారణంగా క్లబ్‌లోని 22 ఎకరాల నుంచి ఫ్లై ఓవర్‌తో పాటు సొరంగం పనులు చేపడుతున్నారని చెప్పారు. క్రీడలు, వినోదం కోసం సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలోని 22 ఎకరాల్లో క్లబ్ ఏర్పాటైందన్నారు. ఈ 22 ఎకరాలు పూర్తిగా క్లబ్‌కు చెందిన ప్రైవేట్ ప్రాపర్టీ అని.. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి గాని, కంటోన్మెంట్ చట్టం కింద పనిచేసే డిఫెన్స్ ఎస్టేట్ ఆఫీసర్‌కుగాని ఎలాంటి హక్కులు లేవని వివరించారు.
పిటిషనర్‌ను సంప్రదించకుండా అక్కడ ఎలివేటెడ్ కారిడార్, సొరంగాల నిర్మాణం కోసం అనుమతి ఇవ్వడం చెల్లదన్నారు. కోర్టులు కూడా సదరు భూమిపై క్లబ్‌కే హక్కులు ఉంటాయని గతంలో తీర్పులు చెప్పిందని గుర్తు చేశారు. హెచ్‌ఎండీఏ తరఫున స్టాండింగ్ కౌన్సిల్ నరసింహ గౌడ్ వాదనలు వినిపిస్తూ.. హైదరాబాద్ లో ట్రాఫిక్‌ను తగ్గించేందుకు రాష్ట్ర రహదారి–1 రాజీవ్ రహదారిపై ఆరు లేన్లుగా పారడైజ్ జంక్షన్ నుంచి శామీర్‌పేట్ వరకు(18 కి.మీ.) ఫ్లై ఓవర్ నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు.
ప్రైవేట్ భూములతోపాటు రక్షణశాఖ భూముల నుంచి నిర్మాణం చేపట్టాల్సి ఉందని వివరించారు. ఇందులో భాగంగా రక్షణ శాఖ అనుమతులు జారీ చేసిందని చెప్పారు. కోర్టు స్పందిస్తూ..సికింద్రాబాద్ క్లబ్ అభ్యంతరాలను తెలుసుకున్న తర్వాతే భూసేకరణ ప్రక్రియను పూర్తి చేయాలని హెచ్ఎండీఏను ఆదేశించింది. పిటిషన్ పై విచారణ ముగిసినట్టు ప్రకటించింది.
ఆ భూసేకరణ చెల్లదు
ఎమ్మార్ ప్రాజెక్టు కోసం ఇరువురు రైతుల భూమిని అధికారులు సేకరించిన విధానాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ఈ మేరకు ఎమ్మార్, ట్రాన్స్‌కో మధ్య చేసిన ఒప్పందాలను, అవార్డును రద్దు చేసింది. భూసేకరణ అవార్డుపై తిరిగి విచారణ జరిపి, రైతుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలని, చట్ట ప్రకారం రైతులకు పరిహారం చెల్లించి భూమిని స్వాధీనం చేసుకోవాలని జస్టిస్ సూరేపల్లి నంద ఇటీవల తీర్పు వెలువరించారు. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం నానక్‌రాంగూడలోని సర్వే నెం.49, 48ల్లో ఇద్దరు రైతులకు చెందిన సుమారు 14 ఎకరాల భూమికి సంబంధించి 2005లో ప్రభుత్వం జారీ చేసిన అవార్డు, రిజిస్ట్రేషన్, లీజు ఒప్పందాలను సవాలు చేస్తూ రైతులు సదానందం, ఎస్.ప్రతాప్‌రెడ్డి హైకోర్టులో 4 పిటిషన్లు దాఖలు చేశారు.
వాళ్ల తరఫున సీనియర్ అడ్వొకేట్ చంద్రసేన్ రెడ్డి వాదించారు. మౌలిక వసతుల ప్రాజెక్ట్ నిమిత్తం భూసేకరణ చేశారని, ఆ భూమిని ఇతర అవసరాలకు వాడరాదని చెప్పారు. దీనిపై ప్రభుత్వ అడ్వకేట్ వాదిస్తూ.. ఒకసారి భూసేకరణ జరిగాక ఆ భూమిపై ప్రభుత్వానికి సర్వహక్కులు ఉంటాయన్నారు. ఆ భూమిని ఏవిధంగానైనా వినియోగించవచ్చని చెప్పారు. విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణం ప్రజావసరాల కోసమేనని తెలిపారు. 2002–2005 మధ్య సేకరించిన భూమిపై ఇప్పుడు పిటిషన్లు వేయడం చెల్లదన్నారు. వాదనలు విన్న హైకోర్టు.. భూమికి ప్రకటించిన అవార్డు, స్వాధీనం చేసుకున్న వివరాలను అధికారులు పిటిషనర్లకు సమర్పించడంలో విఫలమయ్యారని తప్పుపడుతూ పై విధంగా తీర్పు వెలువరించింది.