
హైదరాబాద్, వెలుగు: హైకోర్టుతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కోర్టు ఆవరణల్లో ప్రస్తుతం ఉన్న వైద్య సదుపాయాలపై వివరాలు సమర్పించాలంటూ ప్రభుత్వ వైద్యఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి, ప్రజారోగ్యశాఖ డైరెక్టర్‌తోపాటు హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌కు హైకోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. అంబులెన్స్‌లు, డిస్పెన్సరీ, అందుబాటులో ఉన్న మందులు, వైద్యసిబ్బంది తదితర వివరాలను సమర్పించాలని ఆదేశిస్తూ విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.
కోర్టుల్లో వైద్య సౌకర్యాలు కల్పించకపోవడాన్ని సవాలు చేస్తూ న్యాయవాది జి.హర్షవర్ధన్ హైకోర్టులో దాఖలు చేసిన పిల్‌పై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్, జస్టిస్ యారా రేణుకలతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. వాదనలను విన్న ధర్మాసనం.. ప్రస్తుతం ఉన్న వైద్యసౌకర్యాలపై వివరణ ఇవ్వాలంటూ ప్రతివాదులను ఆదేశిస్తూ విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.