- వారి మృతదేహాలను చూసేందుకు బంధువులను అనుమతించండి
- ఏటూరు నాగారం ఎన్‌కౌంటర్‌పై రాతపూర్వక వివరణ ఇవ్వండి
- పోలీసులకు హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, వెలుగు: ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం పూలకొమ్మ అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లోని ఏడుగురు మావోయిస్టుల మృతదేహాలను మంగళవారం వరకు భద్రపరచాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. మృతదేహాలను చూసేందుకు పిటిషనర్‌తోపాటు బంధువులను అనుమతించాలని ఆదేశాలు జారీ చేసింది. ఎన్‌కౌంటర్ బూటకమని, దీనిపై దర్యాప్తు జరిపించాలంటూ హైకోర్టులో మృతుల్లో ఒకరైన మల్లయ్య భార్య కె.ఐలమ్మ అలియాస్ మీనా సోమవారం లంచ్ మోషన్ పిటిషన్ దాఖ లు చేశారు. దీనిపై జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి విచా రణ చేపట్టగా.. పిటిషనర్ తరఫు న్యాయవాది సురేశ్‌కుమార్ వాదనలు వినిపించారు. ఇది ఎన్‌కౌంటర్ కాదని, మావోయిస్టులను పోలీసులు ప్రాణాలతో తీసుకెళ్లి, కాల్చి చంపారని కోర్టుకు తెలిపారు. విషాహారం పెట్టి, స్పృహ కోల్పోయాక వారిని తీసుకెళ్లి, చిత్రహింసలకు గురి చేశారని అన్నారు. అనంతరం శరీరంలోకి పోలీసులు బుల్లెట్లు దింపారని చెప్పారు. ఒకరి ముంజేతిపై యాసిడ్‌తో కాలిన గాయాలున్నాయని, దుస్తులపై తెల్లటి పొడి ఉందని వెల్లడించారు.
మీడియా ద్వారా సమాచారం తెలుసుకున్న పిటిషనర్ పోలీసులకు ఈ మెయిల్ ద్వారా తన భర్త మృతదేహాన్ని తాము వచ్చే వరకు పోస్టుమార్టం చేయొద్దని కోరినట్టు తెలిపారు. ములుగు ఎస్పీ ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపామని పేర్కొనడం అవాస్తవమని తెలిపారు. ఎన్‌కౌంటర్ జరిగినప్పుడు సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పుల ప్రకారం కేసు నమోదు చేసి, దర్యాప్తు చేయాల్సి ఉందని చెప్పారు. ఎన్‌కౌంటర్ చేసిన పోలీసులే విచారణ జరిపి నిర్ణయాన్ని వెలువరించడం సరికాదని తెలిపారు. బూటకపు ఎన్‌కౌంటర్ కాని పక్షంలో పోలీసులు హడావుడిగా రాత్రికి రాత్రే పోస్టుమార్టం నిర్వహించి, మృతదేహాలను కాల్చివేయాలని ఎందుకు ప్రయత్నించారని ప్రశ్నించారు. మృతదేహాలను వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించి, జాతీయ మానవ హక్కుల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం ఎఫ్‌ఎస్‌ఎల్ నిపుణులతో కూడిన డాక్టర్ల బృందంతో పోస్టుమార్టం నిర్వహించాలని కోరారు. ఇక్కడ కేసు దర్యాప్తునకు మృతదేహం కీలకమని, డెడ్బాడీతోపాటు దుస్తులను భద్రపరిచేలా ఆదేశాలివ్వాలని కోరారు.
నిబంధనల ప్రకారమే పోస్టుమార్టం..
ప్రభుత్వ న్యాయవాది మహేశ్‌రాజె వాదనలు విని పిస్తూ.. ఇప్పటికే పోస్టుమార్టం పూర్తయిందని తెలిపారు. నిబంధనల ప్రకారం నిపుణులైన డాక్టర్ల బృందంతో పోస్టుమార్టం నిర్వహించామని చెప్పారు. పోస్టుమార్టం సమయంలో పిటిషనర్ కూడా ఉన్నారని తెలిపారు.