పెన్షన్‌‌‌‌ బకాయిలు చెల్లించండి: హైకోర్టు

పెన్షన్‌‌‌‌ బకాయిలు  చెల్లించండి: హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: మహబూబాబాద్‌‌‌‌ జిల్లా తొర్రూరుకు చెందిన ఓ రిటైర్డ్ హెడ్​మాస్టర్ పదవీ విరమణ ప్రయోజనాలను ఎనిమిది వారాల్లో చెల్లించాలంటూ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. రిటైర్ అయి ఏడు నెలలు గడుస్తున్నా రావాల్సిన గ్రాట్యుటీ, పీఎఫ్‌‌‌‌ ఇతర ప్రయోజనాలు చెల్లించడంలేదంటూ మాజీ హెచ్ఎం చొల్లేటి రాజసుకన్య హైకోర్టులో పిటిషన్‌‌‌‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌‌‌‌ నామవరపు రాజేశ్వరరావు విచారణ చేపట్టారు. 

పిటిషనర్‌‌‌‌ తరఫు న్యాయవాది సి.ఆర్‌‌‌‌.సుకుమార్‌‌‌‌ వాదనలు వినిపిస్తూ పదవీవిరమణ చేసినా రావాల్సిన ప్రయోజనాలను చెల్లించడంలేదన్నారు. మండల విద్యాధికారి రాసిన లేఖ ఆధారంగా రిటైర్మెంట్‌‌‌‌ బకాయిలను ఖరారు చేసినా ఇప్పటివరకు చెల్లించలేదన్నారు. వాదనలను విన్న న్యాయమూర్తి ఎనిమిది వారాల్లో బకాయిలు చెల్లించాలంటూ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేశారు. దీంతోపాటు వేర్వేరుగా పిటిషన్‌‌‌‌లు దాఖలు చేసిన మరో 30 మందికి కూడా రిటైర్​మెంట్ బెనిఫిట్స్ చెల్లించాలని ఆదేశించారు.