- గ్రూప్1 మెయిన్స్ నిలుపుదలకు హైకోర్టు నిరాకరణ
- పలువురు అభ్యర్థుల అప్పీళ్లు డిస్మిస్
- సుప్రీంకోర్టుకు గ్రూప్-1 అభ్యర్థులు
- 21న పిటిషన్‌పై విచారిస్తామన్న సుప్రీం
హైదరాబాద్, వెలుగు : గ్రూప్–1 మెయిన్స్ వాయిదా వేయాలంటూ పలువురు అభ్యర్థులు దాఖలు చేసిన అప్పీళ్లను హైకోర్టు డివిజన్ బెంచ్ డిస్మిస్ చేసింది. ఈ నెల 15న సింగిల్ జడ్జి వెలువరించిన తీర్పులో జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. సింగిల్ జడ్జి తీర్పును రద్దు చేయాలంటూ జి.దామోదర్‌రెడ్డి ఇతరులు దాఖలు చేసిన అప్పీళ్లను కొట్టివేసింది.
రెండు రోజుల్లో పరీక్ష జరగాల్సిన దశలో వాయిదా వేయలేమంది. 90 శాతానికి పైగా అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారని.. అధికారులు పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేశారని తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలి, జస్టిస్ అలిశెట్టి లక్ష్మీనారాయణతో కూడిన డివిజన్ బెంచ్ శుక్రవారం తీర్పు వెలువరించింది.
ఇదీ తీర్పు సారాంశం
గ్రూప్–1 మెయిన్స్ పరీక్షల వ్యవహారంలో కలుగచేసుకోవాలనే అప్పీళ్లల్లో జోక్యం చేసుకునేందుకు పిటిషన్స్‌లో మెరిట్స్ ఏమీ లేవని హైకోర్టు తెలిపింది. ‘‘గత ఫిబ్రవరిలో రీ నోటిఫికేషన్ ఇస్తే ఆగస్ట్‌లో పిటిషన్లను వేయడం ఏమిటి. ప్రిలిమ్స్ రాసి, ఫలితాలు విడుదలయ్యాక కోర్టుకు వచ్చారనే విషయాన్ని పిటిషనర్లు గుర్తుంచుకోవాలి. మొత్తం 6,147 అభ్యంతరాలను పరిశీలించాకే తుది కీ విడుదల అయ్యింది. ఏ ప్రశ్న సరైందో, ఏ ప్రశ్న సరైంది కాదో కోర్టులు తేల్చలేవు. ఈ విషయాన్ని నిపుణుల కమిటీనే తేల్చాలి. అక్టోబర్‌లో మెయిన్స్ అని నోటిఫికేషన్‌లో ఉంటే తీరుబడిగా కోర్టుకు వచ్చారు. ఇప్పటికే రెండుసార్లు ప్రిలిమ్స్ రద్దయ్యాయి. మూడోసారి ప్రిలిమ్స్ జరిగింది.
ఇప్పుడు మెయిన్స్ వాయిదా వేస్తే అభ్యర్థుల్లో తీవ్ర నిరాశ నెలకొంటుంది. ఇక గ్రూప్–1 ఓ ప్రహసనంలా మారిపోతుంది. మెయిన్స్‌కు అర్హత సాధించిన 31,383లో 90 శాతం మంది హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారంటే ఎంతమంది పరీక్షకు రెడీగా ఉన్నారో అర్థమవుతున్నది. మరో వైపు ఈ నెల 21 నుంచి పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రెండు రోజుల్లో పరీక్ష జరిగాల్సిన దశలో వాయిదా వేయడం వీలుకాదు. సింగిల్ జడ్జి అన్ని అంశాలను లోతుగా పరిశీలించిన తర్వాతే తీర్పు వెలువరించినందున ఆ తీర్పులో తాము జోక్యం చేసుకోబోము” అని తీర్పు వెలువరించింది.
పిటిషనర్ల వాదన
గ్రూప్ 1 ప్రిలిమినరీ కీలో తప్పులు ఉన్నాయని ఆధారాలు సమర్పించినప్పటికీ సింగిల్ జడ్జి పట్టించుకోలేదని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు జొన్నగడ్డ సుధీర్, శివ ఇతరులు వాదించారు. పరీక్షను రద్దు చేసి తిరిగి నిర్వహించేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ప్రశ్నలు ఏ రకంగా తప్పులున్నాయో చెప్పినా సింగిల్ జడ్జి పరిశీలనే చేయలేదని, ఎన్నో ఏండ్లుగా ఆశలు పెట్టుకున్న అభ్యర్థులకు న్యాయం చేకూర్చాలని కోరారు. తప్పుడు సమాధానాలతో ఉన్న కీ ఆధారంగా మెయిన్స్‌కు అర్హత జాబితాను రూపొందిస్తే ఎంతో మంది అభ్యర్థులకు తీరని అన్యాయం జరుగుతుందని.. సింగిల్ జడ్జి తీర్పును రద్దు చేయాలని వాదించారు.
అన్ని ఏర్పాట్లు పూర్తయినయ్
టీజీపీఎస్సీ, ప్రభుత్వం తరఫు న్యాయవాదులు వాదిస్తూ, ఈ నెల 21 నుంచి 27వ తేదీ వరకు గ్రూప్–1 ప్రధాన పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు జరిగాయని, చిట్టచివరి దశలో గ్రూప్–1 పరీక్షల విషయంలో జోక్యం చేసుకోరాదన్నారు. ఇప్పటికే 90 శాతం మంది అభ్యర్థులు హాల్‌టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకున్నారని, ఈ నెల 20 వరకు హాల్‌టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకునేందుకు వీలుందని తెలిపారు. కొద్దిమంది అభ్యర్థులు మాత్రమే గ్రూప్–1 పరీక్షల నిర్వహణను వ్యతిరేకిస్తున్నారని, వీటిని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. హైకోర్టు స్పందింస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోలేమని.. ఈ దశలో అప్పీళ్లను ఆమోదించలేం కనుక డిస్మిస్ చేస్తున్నామని తీర్పు వెలువరించింది.
సుప్రీంకోర్టుకు గ్రూప్– 1 అభ్యర్థులు
21న పిటిషన్ విచారిస్తామని కోర్టు వెల్లడి
న్యూఢిల్లీ, వెలుగు : గ్రూప్– 1 పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ పలువురు అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పరీక్షల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఫాలో కాలేదని, అత్యవసరంగా ఈ పిటిషన్ విచారించాలని కోరారు. అభ్యర్థుల తరఫున అడ్వొకేట్ మోహిత్ రావు శుక్రవారం సీజేఐ బెంచ్‌లో స్పెషల్ మోషన్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. అయితే.. ఈ పిటిషన్‌ను వెంటనే విచారించలేమని, సోమవారం (21న) విచారణ చేపడతామని చీఫ్ జస్టిస్ బెంచ్ స్పష్టం చేసింది.
అనంతరం గ్రూప్– 1 అభ్యర్థులు ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. తాము వేసిన పిటిషన్‌పై సోమవారం విచారణ చేపడతామని సుప్రీంకోర్టు తెలిపిందన్నారు. కోర్టు తీర్పు వచ్చే దాకా గ్రూప్ –1 మెయిన్స్‌ను రద్దు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మరోవైపు, అదే రోజు గ్రూప్– 1 మెయిన్స్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.