- ఫోన్ ట్యాపింగ్ కేసులో హైకోర్టు కామెంట్
- ప్రజల వ్యక్తిగత సమాచారం ఎలా సేకరిస్తరు?
- ఎఫ్ఎస్ఎల్ నివేదిక ఆధారంగా దర్యాప్తు చేయాలి
- తిరుపతన్న బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేస్తూ హైకోర్టు తీర్పు
హైదరాబాద్, వెలుగు: బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ చీఫ్ చెప్పినట్లుగానే చేశామంటే కుదరదని ఫోన్ ట్యాపింగ్ కేసులో హైకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో బెయిల్ కోసం నిందితుడు మేకల తిరుపతన్న దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు మంగళవారం డిస్మిస్ చేసింది. బాధ్యతలు గుర్తెరిగి విధులు నిర్వహించాలని, తన చర్యల పరిణామాలు ఎలా ఉంటాయో, అవి చట్టబద్ధమో కాదో కూడా గుర్తెరిగి వ్యవహరించాలని తేల్చిచెప్పింది. ఈ కేసులో 4వ నిందితుడైన మేకల తిరుపతన్న బెయిల్ పిటిషన్ పై జస్టిస్ జువ్వాడి శ్రీదేవి మంగళవారం విచారణ చేపట్టారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రాసిక్యూషన్ సమర్పించిన సమాచారాన్ని, రికార్డులను పరిశీలిస్తే పలువురు వ్యక్తుల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించినట్లు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు.
పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశాక నిందితుల ఫోన్లకు చెందిన కాల్ డేటాపై ఎఫ్ఎస్ఎల్ నివేదిక వచ్చిందని, దాని ఆధారంగా దర్యాప్తు కొనసాగించాలన్న ప్రాసిక్యూషన్ వాదనను జడ్జి ఆమోదించారు. ఇంకా ఇద్దరు కీలక నిందితులు పరారీలో ఉన్నారని, ఈ దశలో తిరుపతన్నకు బెయిల్ ఇవ్వలేమని, ఆయన కస్టడీలోనే ఉండాలని స్పష్టం చేశారు. పిటిషనర్ తరపు న్యాయవాది వి.సురేందర్రావు వాదిస్తూ.. మార్చి 24న అరెస్ట్ చేశారని, చార్జి షీట్ 30 రోజులు దాటిన తరువాత దాఖలు చేసినందున చట్టబద్ధంగా బెయిలు మంజూరు చేయాల్సి ఉందన్నారు. ఎస్ఐబీ చీఫ్ గా ఉన్న ప్రభాకర్ చెప్పినట్టే విధులు నిర్వహించారని తెలిపారు. విచారణకు సహకరిస్తారని, బెయిల్ ఇవ్వాలని కోరారు. ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు అమెరికాలో, మరో నిందితుడు శ్రవణ్ పరారీలో ఉన్నాడని.. ఈ దశలో బెయిల్ మంజూరు సరికాదన్నారు. వాదనలు విన్న తర్వాత బెయిల్ పిటిషన్ ను తిరస్కరిస్తూ జడ్జి తీర్పు చెప్పారు.