ఆ భూ కేటాయింపులకు కేంద్రం అనుమతి అక్కర్లే : హైకోర్టు

ఆ భూ కేటాయింపులకు కేంద్రం అనుమతి అక్కర్లే : హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లాలోని 6,467 ఎకరాల అటవీ భూమిని అటవీయేతర అవసరాలకు వినియోగించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిల్‌‌‌‌ను హైకోర్టు కొట్టేసింది. 1980లో అటవీ సంరక్షణ చట్టం రాకముందు జరిగిన భూకేటాయింపులకు కేంద్ర సర్కార్‌‌‌‌ అనుమతి అవసరం లేదని స్పష్టం చేసింది. డీనోటిఫై చేయకుండా భూమి బదలాయింపు చెల్లదంటూ ఫోరం ఫర్‌‌‌‌ బెటర్‌‌‌‌ హైదరాబాద్‌‌‌‌ అనే స్వచ్ఛంద సంస్థ 2009లో పిల్‌‌‌‌ వేయగా, దాన్ని కొట్టివేస్తూ చీఫ్‌‌‌‌ జస్టిస్‌‌‌‌ అలోక్‌‌‌‌ అరాధే, జస్టిస్‌‌‌‌ అనిల్‌‌‌‌ కుమార్ లతో కూడిన డివిజన్‌‌‌‌ బెంచ్‌‌‌‌ ఇటీవల తీర్పు ఇచ్చింది.

 1956లో నిజాం రాజు నుంచి రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం ఇమారత్‌‌‌‌కంచలో4,067 ఎకరాలు, సరూర్ నగర్ మండలం మామిడిపల్లిలో 2,400 ఎకరాల అటవీ భూములను ప్రభుత్వం సేకరించింది. వాటిని అటవీయేతర అవసరాలకు వినియోగించాలని నిర్ణయం తీసుకుంది. ఇమారత్‌‌‌‌కంచలోని 4,067 ఎకరాలను 1966లో మిస్సైల్‌‌‌‌ పరీక్షల నిమిత్తం డిఫెన్స్‌‌‌‌కు లీజుకు ఇచ్చింది. ఇక మామిడిపల్లిలో 2,400 ఎకరాలను గొర్రెల పెంపకం కేంద్రం కోసం 1972లో పశుసంవర్థక శాఖకు ఇచ్చింది.

 అయితే అటవీశాఖ భూములను కేంద్ర అనుమతితో డీనోటిఫై చేయకుండా అటవీయేతర అవసరాలకు వినియోగించడాన్ని సవాల్ చేస్తూ ‘ఫోరం ఫర్‌‌‌‌ బెటర్‌‌‌‌ హైదరాబాద్‌‌‌‌’ స్వచ్ఛంద సంస్థ పిల్ దాఖలు చేసింది. అటవీ సంరక్షణ చట్టం 1980లో వచ్చిందని, అప్పటికే అటవీ భూమిని అటవీయేతర అవసరాలకు వినియోగించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని, ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టలేమని పేర్కొంటూ పిల్ ను హైకోర్టు కొట్టివేసింది.