![ఏపీ క్యాస్ట్ సర్టిఫికెట్ తెలంగాణలో చెల్లదు : హైకోర్టు](https://static.v6velugu.com/uploads/2025/02/high-court-dismisses-petitions-that-ap-cast-certificate-is-invalid-in-telangana_dxwYyKAZi5.jpg)
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ పీజీ మెడికల్ అడ్మిషన్లలో ఏపీ ప్రభుత్వం జారీ చేసిన ఎస్సీ క్యాస్ట్సర్టిఫికెట్లను అనుమతించాలంటూ దాఖలైన పిటిషన్లను సోమవారం హైకోర్టు కొట్టివేసింది. ఏపీలో పొందిన సర్టిఫికెట్ ద్వారా ఇక్కడ రిజర్వేషన్లు కల్పించాలని అనుమతి మంజూరు చేయలేమని స్పష్టం చేసింది. ఏపీ ధ్రువీకరణ పత్రం ద్వారా సమర్పించిన దరఖాస్తులను ఎస్సీ కింద పరిగణనలోకి తీసుకుంటూ కౌన్సెలింగ్ ప్రక్రియకు అనుమతించాలని.. అయితే, ఫలితాలను వెల్లడించరాదంటూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేసింది.
తెలంగాణ అధికారులు తాజాగా జారీ చేసిన ఎస్సీ/ఎస్టీ/బీసీ కుల ధ్రువీకరణ పత్రాలను సమర్పించినవారికే పీజీ మెడికల్ అడ్మిషన్లలో రిజర్వేషన్లు కల్పిస్తామన్న నిబంధనను సవాలు చేస్తూ నెల్లూరు జిల్లాకు చెందిన నిహారిక తదితరులు దాఖలు చేసిన పిటిషన్‌లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్, జస్టిస్ రేణుక యారాలతో కూడిన బెంచ్ సోమవారం విచారణ చేపట్టింది.